
- మహిళలకు 13 సీట్లు కేటాయింపు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 101 సీట్లకూ జేడీయూ తన అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం 57 మందితో తొలి జాబితా విడుదల చేసిన జేడీయూ గురువారం మరో 44 మందితో రెండో జాబితా విడుదల చేసింది. దీంతో అన్ని స్థానాలకూ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడీయూ.. పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 101 సీట్లలో పోటీ చేస్తున్నది.
ఇక జేడీయూ ప్రకటించిన 101 మంది అభ్యర్థుల్లో 37 మంది ఓబీసీలు, 22 మంది ఈబీసీలు ఉన్నారు. ఓసీలు 22 మంది ఉండగా.. మహిళలకు 13 సీట్లు కేటాయించారు. 4 స్థానాలు ముస్లింలకు ఇచ్చారు. శాసన మండలిలో సభ్యులు కాని, నితీశ్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అందరికీ రెండోసారి అవకాశం కల్పించారు. అలాంటి వారిలో విజయ్ కుమార్ చౌధరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేషి సింగ్, సుమిత్ కుమార్ సింగ్ ఉన్నారు. వారం క్రితం తిరిగి జేడీయూలో చేరిన విభా దేవికీ సీటు ఇచ్చారు.
18 మందితో బీజేపీ మూడో లిస్టు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 18 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. బినా దేవికి కొచ్చాధామన్ సీటు ఇవ్వగా.. సంగీతా కుమారికి మొహనియా సీటు ఇచ్చారు. నర్కాతియాగంజ్ నుంచి సంజయ్ పాండ్య, రాఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్, భబువా నుంచి భరత్ బింద్ బరిలో నిలిచారు.
ఎస్సీ సీటు అయిన పిర్ పైంతిని మురారి పాశ్వాన్ కు కేటాయించారు. రామ్ గఢ్ సీటును అశోక్ కుమార్ సింఘాల్ కు ఇచ్చారు. కాగా.. మూడో లిస్టుతో బీజేపీ కూడా మొత్తం 101 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.