
న్యూఢిల్లీ: బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల పంపకాలపై త్వరగా తేల్చాలని ఆర్జేడీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు ఫోన్ చేసి సీట్ల పంపకాలపై చర్చించారు. కాంగ్రెస్ కు 52 సీట్లు ఇస్తామని ఆర్జేడీ ఇంతకుముందు ఆఫర్ చేసింది.
కానీ, తమకు 61 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీనిపై ఇదివరకే రాష్ట్ర నేతల మధ్య చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం రాకపోవడంతో విషయం జాతీయ స్థాయి నేతల వరకు వెళ్లింది. కాంగ్రెస్ కోరినట్లే 61 సీట్లు ఇస్తామని ఆర్జేడీ ఒప్పుకుంది. అయితే, బలమైన స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుండడంతో ఆ విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. కహల్ గావ్, నర్కాతియాగంజ్, వాసాలిగంజ్, చైన్ పూర్, బాచ్ వారా వంటి స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
2020లో 70 చోట్ల కాంగ్రెస్ పోటీ
2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేసి 19 చోట్ల గెలిచింది. ఈసారి 61 కావాలని డిమాండ్ చేస్తోంది. అలాగే, ఆర్జేడీ గత ఎన్నికల్లో 144 చోట్ల పోటీచేసి 75 స్థానాల్లో గెలిచింది. ఈసారి మరిన్ని సీట్లను కోరుకుంటోంది. మరోవైపు మహాఘట్ బంధన్ లోని లెఫ్ట్ పార్టీలకూ సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంది.
అయితే, ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్ బుధవారం రాత్రి తన అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్.. రాఘోపూర్ నుంచి నామినేషన్ వేసిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ తన ఫస్ట్ లిస్ట్ క్యాండిడేట్లను ప్రకటించింది.