
- మేం ఎవరికీ టార్గెట్ కాదు.. మాకు ఎవరూ టార్గెట్ కాదు: కొండా మురళి
- సీఎం రేవంత్ సహా పొంగులేటి, వేం నరేందర్‍తో మాకు విభేదాల్లేవ్
- నా బిడ్డ చిన్నది.. చిన్నోళ్లకు కొంత ఆవేశం ఎక్కువుంటది.. పిలిచి విషయం తెలుసుకుంట
- సుమంత్ తమ కుటుంబ సభ్యుడేనని, తప్పు చేస్తే చట్టం ఉందని వెల్లడి
వరంగల్, వెలుగు: సీఎం రేవంత్‍రెడ్డి దగ్గరికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. సీఎం రేవంత్‍రెడ్డి సహా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డితో తమకు ఎటువంటి విభేదాల్లేవని.. తాము ఎవరికి టార్గెట్ కాదని, తమకు ఎవరూ టార్గెట్ కాదని తెలిపారు. అదేసమయంలో తమను ఎవరైనా టార్గెట్ చేసినా వచ్చే నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కుట్రలు, జైళ్లు, పోలీస్ కేసులు కొండా దంపతులకు కొత్త కాదని.. పోరాటం చేస్తాం తప్పితే.. వెనక్కి పోయేవాళ్లం కాదన్నారు. తమవెంట 90 శాతం ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో రెండ్రోజులుగా జరుగుతున్న దుమారం మీద కొండా మురళి స్పందించారు. గురువారం ఆయన హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
సుమంత్ ఘటనలో ఏంజరిగిందో కూడా తనకు పూర్తిగా తెలియదన్నారు. ‘‘రేవంతన్న వద్దకు పోతా. కంపల్సరీ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా” అని తెలిపారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. రాత్రి సమయంలో పోలీసులు మంత్రి నివాసానికి ఎందుకొచ్చారో తెలియదని, తన బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు.
చిన్నవాళ్లకు కొంత ఆవేశం ఉంటుందని, తన బిడ్డ కూడా అలాగే మాట్లాడి ఉంటుందని, ఆమెను పిలిచి విషయమేంటో తెలుసుకుంటానని ఆయన అన్నారు. పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సూచన మేరకు తాను మీడియాకు కొంత దూరంగా ఉంటున్నానని.. గతంలో ఉన్న ఆవేశాన్ని తగ్గించి ఆలోచనను పెంచుకున్నట్లు తెలిపారు.
కొండా దంపతులం సేఫ్‍గా ఉంటామని.. తమకు రాహుల్‍గాంధీ అండ ఉందని అన్నారు. సుమంత్ తమ కుటుంబ సభ్యుడని, అతను తప్పుచేస్తే చట్టం ఉందని ఆయన పేర్కొన్నారు. రేవంత్‍రెడ్డి సీఎం అవడం కోసం కొండా దంపతులం ఎంతో కష్టపడ్డామని.. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం మాటిచ్చారని, ఆయన మీద తనకు నమ్మకం ఉందని కొండా మురళి అన్నారు.