Naga Chaitanya: వ్యక్తిగత గౌరవం కోసం నాగచైతన్య న్యాయపోరాటం.. హైకోర్టు కీలక ఆదేశాలు

Naga Chaitanya: వ్యక్తిగత గౌరవం కోసం నాగచైతన్య న్యాయపోరాటం.. హైకోర్టు కీలక ఆదేశాలు

టాలీవుడ్ హీరో, అక్కినేని నాగ చైతన్య తన వ్యక్తిగత గౌరవం, ప్రతిష్టను కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వాయిస్‌ను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంటూ ‘పర్సనాలిటీ రైట్స్’ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా నాగచైతన్య పర్సనాలిటీ రైట్స్‌కు తాత్కాలిక రక్షణ కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఆయన పేరు, ఫోటోలతో ప్రచారం అవుతున్న అసభ్యకర లింకులు, అనధికారిక కంటెంట్‌ను తొలగించాలని సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కోర్టు సూచించింది.

చైతన్య తరఫు న్యాయవాది వాదన..

AI ద్వారా రూపొందించిన ఫేక్ వీడియోలు, పరువు నష్టం కలిగించే పోస్టులు నాగచైతన్య ప్రతిష్టకు తీవ్ర నష్టం చేస్తున్నాయని న్యాయవాది వైభవ్ గగ్గర్ కోర్టుకు వివరించారు. ముఖ్యంగా మాజీ భార్యతో సంబంధం ఉన్న తప్పుడు వీడియోలు, ట్రోలింగ్ కంటెంట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే కొన్ని వీడియోలను యూట్యూబ్ తొలగించినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా పడింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున కూడా ఇదే తరహా పర్సనాలిటీ రైట్స్ రక్షణ పొందిన సంగతి తెలిసిందే.

మైథికల్ థ్రిల్లర్గా వృషకర్మ..

నాగచైతన్య తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రయోగాత్మక పంథాలో సాగుతున్నారు. 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో టాలీవుడ్‌ను వణికించిన దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి సరికొత్త సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. సమాజంలో చెలరేగుతున్న అతీంద్రియ శక్తులను అడ్డుకోవడానికి ప్రకృతి ఎంచుకున్న ఒక సామాన్యుడి అసాధారణ ప్రయాణమే ఈ సినిమా అని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీలో నాగచైతన్య సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఎస్‌‌‌‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.