
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లో వరద నీటిలో మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన కేసును సీబీఐకి ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఈ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనాన్ని వేగంగా నడిపి రోడ్డుపై ఉన్న వాననీరు రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వెళ్లేందుకు కారణమయ్యాడన్న ఆరోపణపై మనూజ్ కథూరియాను అరెస్టు చేయడాన్ని ఖండించింది. ‘‘ఇంకా నయం.. వాననీటికి చలాన్ వేయలేదు” అని కామెంట్ చేసింది. రావూస్ ఘటనలో చాలా మంది సీనియర్ అధికారుల హస్తం ఉండవచ్చని పేర్కొంది.
అమాయకులను కాపాడి, దోషులను పట్టుకున్నప్పుడే పోలీసులపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని కోర్టు తెలిపింది. దోషులను వదిలేసి అమాయకులను అరెస్టు చేయరాదని హెచ్చరించింది. దీంతో పోలీసులు కోర్టుకు క్షమాపణ చెప్పారు. అనంతరం కేసును సీబీఐకి హైకోర్టు బదిలీ చేసింది. ఘటనపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలను దృష్టిలో ఉంచుకొని కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నా మని పేర్కొంది. సీబీఐ దర్యాప్తును పరిశీలిం చేందుకు ఒక సీనియర్ అధికారిని నియమిం చాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఆదేశాలిచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది.