దక్షిణాది రాష్ట్రాలంటే..ఢిల్లీ పెద్దలకు చిన్నచూపు : సంజయ బారు

దక్షిణాది రాష్ట్రాలంటే..ఢిల్లీ పెద్దలకు చిన్నచూపు : సంజయ బారు
  •    ఏపీ విభజనతో ప్రాధాన్యత తగ్గింది : సంజయ బారు
  •     తెలుగు రాష్ట్రాల్లోకుల రాజకీయాలు పెరిగినయ్
  •     దక్షిణాది రాజకీయాలపై.. ఉత్తరాది వాళ్లకు తెలిసింది చాలా తక్కువ
  •     ‘ది డెక్కన్ పవర్ ప్లే’ పుస్తకావిష్కరణలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు
  •     తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో చెప్పేందుకే ఈ బుక్​: రచయిత దేవులపల్లి అమర్

న్యూఢిల్లీ, వెలుగు :  దక్షిణాది రాష్ట్రాలంటే ఢిల్లీ పెద్దలకు చిన్నచూపని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ బారు అన్నారు. ఏపీ విభజన తర్వాత జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత, ప్రభావం మరింత తగ్గిందని అభిప్రాయపడ్డారు. విభజనతో ఉభయ రాష్ట్రాల్లో కుల రాజకీయాలు పెరిగాయన్నారు. ఏపీలో రెడ్డి, కమ్మ, తెలంగాణలో రెడ్డి, వెలమ కులాల ఆధిపత్యం కొనసాగుతున్నదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రాసిన ‘ది డెక్కన్ పవర్ ప్లే’ పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రామ్ జరిగింది. 

ఈ పుస్తకాన్ని సంజయ బారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా (ఎఫ్ సీసీ) ప్రెసిడెంట్ వెంకట్ నారాయణ, పీసీఐ చైర్మన్ గౌతమ్ లహరి, సీనియర్ జర్నలిస్టులు ఎస్ఎన్ సిన్హా, రూప పబ్లికేషన్స్, పుస్తక ప్రచురణకర్త రుద్ర నారాయణ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ బారు మాట్లాడారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల గురించి ఉత్తరాది వారికి చాలా తక్కువ తెలుసు. ఒకప్పుడు దక్షిణాది అంటే మద్రాస్ పేరు మాత్రమే వినబడేది. ఏపీ చిత్రపటాన్ని ఇండియా మ్యాప్ లో ఎన్టీఆర్ బలంగా నాటారు. 

డెక్కన్ అంటే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు కలిసిన ప్రాంతం. ఈ డెక్కన్ ప్రాంతం.. డెవలప్​మెంట్ ఎజెండాతో ముందుకు సాగితే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మతం అనేది కీలకంగా ఉన్నది”అని సంజయ బారు విమర్శించారు. 42 ఎంపీ స్థానాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలుగా ఏర్పడటంతో సీట్లు తగ్గి ఢిల్లీ పెద్దల ఆదరణ కోల్పోయిందని అన్నారు. జార్ఖండ్, చత్తీస్​గఢ్ మాదిరిగా కేవలం రాష్ట్రాలుగానే మిగిలాయని తెలిపారు.

 జీడీపీ గ్రోత్ స్టేట్స్ గా దక్షిణాది రాష్ట్రాలు పేరు పొందాయని ఎఫ్ సీసీ ప్రెసిడెంట్ వెంకట్ నారాయణ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయాలపై ఇంగ్లీష్​లో చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయని తెలిపారు. అందుకే.. అమర్ రాసిన ఈ పుస్తకం ఉత్తరాది వారికి తెలుగు రాజకీయాలపై అవగాహన కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో అభివృద్ధి అంశాలు ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పుస్తక ప్రయత్నం ఏమిటంటే..: అమర్

దక్షిణాదిలో ఏం జరుగుతున్నదో ఢిల్లీ పెద్దలకు తెలియదని, అది తెలిపే ప్రయత్నమే ‘ది డెక్కన్ పవర్ ప్లే’ పుస్తకం అని రచయిత దేవులపల్లి అమర్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు, పొలిటికల్ లీడర్లపై ఢిల్లీ పెద్దలకు తప్పుడు అవగాహన ఉందన్నారు. ఆ ఆలోచన మార్చేందుకే తొలిసారి ఇంగ్లీష్ లో పుస్తకం రాసినట్లు వివరించారు. ఈ పుస్తకం చదివిన తర్వాత అభిప్రాయం మారుతుందన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 1976లో తాను మీడియా రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. 

అయితే, 1978 తర్వాత దక్షిణాదితో పాటు దేశంలో కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చిందని వివరించారు. ఎమర్జెన్సీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పరిస్థితి ఇంకా బలహీనంగా కనిపించిందని తెలిపారు. ఈ సందర్భంలో పాత కాంగ్రెస్ ను ఓడించి, అంతర్గతంగా కొత్త కాంగ్రెస్ పుట్టిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా, పదేండ్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించలేదని, ఏపీలోనూ 2004 నుంచి 2014 దాకా మాత్రమే కాంగ్రెస్​ను ప్రజలు నమ్మారని చెప్పారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేశారు.