ఈడీ దాడులకు భయపడబోమన్న మనీష్ సిసోడియా

ఈడీ దాడులకు భయపడబోమన్న మనీష్ సిసోడియా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులు  చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. దేవేంద్ర శర్మ అలియాస్ రింకూ దర్యాప్తుకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. ఇక తన పీఏ అరెస్ట్ పై మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన సహాయకుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. 

గతంలో కూడా తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇంటిపై దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకు లాకర్లను వెతికారు. అంతటితో ఆగకుండా తన స్వగ్రామంలో కూడా తనిఖీలు నిర్వహించారు. అయినా సరైన ఆధారాలు లభించలేదన్నారు. ఇప్పుడు తాజాగా తన పీఏ ఇంట్లో ఈడీ దాడులు చేసినా ఏమీ దొరక్కపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్  స్టేషన్ కు తీసుకెళ్లడంపై మనీష్ సిసోడియా మండిపడ్డారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతో ఈడీ దాడులు చేయిస్తోందని ట్వీట్ చేశారు.  ఈడీ దాడులకు భయపడబోమని మనీస్ సిసోడియా స్పష్టం చేశారు.