
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కావాలనే తక్కువ కెలోరీల ఆహారం తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా అన్నారు. కేజ్రీవాల్ డైట్ పాటించేలా చూడాలని, ఎప్పకటికపుడు ఇన్సులిన్ తీసుకునేలా చేయాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి ఎల్జీ లేఖ రాశారు. కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను గమనించేందుకు ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని, అలాగే సీఎం ఆరోగ్య పరిస్థితిపై తెలియజేయాలని ఎల్జీ ఆదేశించారు.
‘‘కేజ్రీవాల్ తక్కువ కెలోరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నందు వల్లే బరువు తగ్గారు. దీంతో ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పడిపోయాయి. అంతేకాకుండా ఈ నెల 7న రాత్రి భోజనానికి ముందు కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇలా చేస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది” అని ఎల్జీ తన లేఖలో పేర్కొన్నారు.