ఢిల్లీలో కిరాయి మస్తు పిరం..ఏడాదికి చదరపు అడుగుకి రూ.6,540

ఢిల్లీలో కిరాయి మస్తు పిరం..ఏడాదికి చదరపు అడుగుకి రూ.6,540
  • ఆసియాలో హాంకాంగ్​ నం.1
  • వెల్లడించిన నైట్​ఫ్రాంక్​

న్యూఢిల్లీ: ఆసియా– పసిఫిక్‌‌లోని ప్రైమ్ ఆఫీస్ మార్కెట్‌‌లలో (ఏపీఏసీ) ఢిల్లీ-–ఎన్​సీఆర్​ ఆరో అత్యంత ఖరీదైన మార్కెట్‌‌గా ఎదిగింది. ఈ నగరంలో ఒక చదరపు అడుగుకి 78.4 డాలర్లు (దాదాపు రూ.6,540) వార్షిక ఆక్యుపెన్సీ ధర ఉందని నైట్ ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది.   ఆక్యుపెన్సీ ఖర్చులో అద్దె, స్థానిక పన్నులు,  ఇతర ఛార్జీలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన ఆసియా-–పసిఫిక్ ప్రైమ్ ఆఫీస్ రెంటల్ ఇండెక్స్‌‌ను ఈ ఏడాది మూడో క్వార్టర్  (జులై–-సెప్టెంబర్) కాలానికి విడుదల చేసింది. దీని ప్రకారం హాంకాంగ్ ఈ క్వార్టర్​లో అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్‌‌గా కొనసాగింది. ఇక్కడ ఆక్యుపెన్సీ ఖర్చు చదరపు అడుగుకు  సంవత్సరానికి  164.7 డాలర్లు (రూ.13,600) ఉంది. 

ఏపీఏసీ ప్రాంతంలో ముంబై తొమ్మిదవ అత్యంత ఖరీదైన వాణిజ్య మార్కెట్‌‌గా నిలిచింది. దీని వార్షిక ఆక్యుపెన్సీ ఖర్చు చదరపు అడుగుకు 70.5 డాలర్లు. బెంగళూరులోని ప్రైమ్ ఆఫీస్ స్పేస్  ఆక్యుపెన్సీ ఖర్చు సంవత్సరానికి చదరపు అడుగుకు  36.1 డాలర్లు. మొత్తం 23 నగరాల్లో ఇది 19వ స్థానంలో ఉంది. సింగపూర్ రెండవ అత్యంత ఖరీదైన రెంటల్​ మార్కెట్​. తరువాత స్థానాల్లో సిడ్నీ, టోక్యో,  సియోల్ ఉన్నాయి. బీజింగ్ ఏడవ స్థానంలో, హో చి మిన్ సిటీ ఎనిమిదో స్థానంలో,  షాంఘై పదో స్థానంలో నిలిచాయి. ఈ క్వార్టర్​లో ఏడు లక్షల చదరపు మీటర్ల జాగాకు లీజు ఒప్పందాలు జరిగాయి. భారతదేశ మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ బలంగా ఉందని నైట్​ఫ్రాంక్​ రిపోర్టు పేర్కొంది. కంపెనీలు పెద్ద ఎత్తున గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌‌లను ఏర్పాటు చేస్తుండటం వల్ల ఆఫీసులకు గిరాకీ బాగా పెరిగిందని వివరించింది.  లావాదేవీల వాల్యూమ్‌‌లు పెరిగినప్పటికీ, భూయజమానులు ఆక్యుపెన్సీ స్థాయిలను పెంచడంపై దృష్టి సారించినందున అద్దె స్థాయిలు నిలకడగా ఉన్నాయని తెలిపింది.