న్యాయవాదులతో వివాదంపై పోలీసుల ఆందోళన 

న్యాయవాదులతో వివాదంపై పోలీసుల ఆందోళన 
  • ఢిల్లీ హెడ్‌‌‌‌క్వార్టర్స్ ఎదుట నిరసన వెల్లువ

న్యూఢిల్లీ: ఢిల్లీలో పోలీసులు, న్యాయవాదుల మధ్య చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. షహదారా పోలీస్ స్టేషన్‌‌‌‌లో న్యాయవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం 100 మందికి పైగా పోలీసులు ఢిల్లీ పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్లకార్డులు, పోస్టర్లు పట్టుకుని నిరసన తెలిపారు. ఏసీపీ మనస్వి వశిష్ట, షహదారా ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ అరుణ్ కుమార్‌‌‌‌ను వారి పాత స్థానాలకే తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు.

అయితే, అక్టోబర్ 23న షహదారా పోలీస్ స్టేషన్‌‌‌‌లో జరిగిన ఘర్షణలో న్యాయవాది లలిత్ బన్సల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై లాయర్లు నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగడంతోపాటు అనిశ్చిత కాల సమ్మెకు పిలుపునిచ్చారు. న్యాయవాదుల డిమాండ్ మేరకు అక్టోబర్ 28న పోలీస్ ఉన్నతాధికారులు ఏసీపీ మనస్వి వశిష్టను, ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ అరుణ్ కుమార్‌‌‌‌ను వేరే విభాగాలకు బదిలీ చేశారు. దీంతో పోలీసు అధికారుల బదిలీలను వ్యతిరేకిస్తూ తాజాగా పోలీసు సిబ్బంది రోడ్డెక్కడం కలకలం రేపింది.

ఠాణాలకే రక్షణ లేకపోతే ఎలా?: ఏసీపీ మనస్వి

ఈ నిరసనలో పాల్గొన్న ఏసీపీ మనస్వి వశిష్ట మీడియాతో మాట్లాడుతూ ఇది పోలీసుల 'స్వచ్ఛమైన స్పందన' అని అన్నారు. పోలీసుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని, రౌడీయిజానికి వ్యతిరేకంగా గళం వినిపించడం అవసరమని పేర్కొన్నారు. "పోలీస్ స్టేషన్ల లోపలే మాకు రక్షణ లేకపోతే, ఇక ఏ ప్రదేశం కూడా సురక్షితంగా ఉండదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, దీనిపై త్వరలోనే తగిన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.