కాలువలో పోలీస్ ఆఫీసర్ కొడుకు శవం లభ్యం.. అసలేమైందంటే..

కాలువలో పోలీస్ ఆఫీసర్ కొడుకు శవం లభ్యం.. అసలేమైందంటే..

జనవరి 23 నుంచి కనిపించకుండా పోయిన ఢిల్లీ ఏసీపీ కుమారుడు లక్ష్య చౌహాన్ మృతదేహం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల అతను కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందగా .. చౌహాన్ స్నేహితులే.. అతన్ని కాల్వలోకి తోసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పానిపట్‌లోని మునక్‌ కాలువలోకి లక్ష్య చౌహాన్‌ను తోసి హత్య చేశారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చౌహాన్ మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.

ఈ కేసులో ఇప్పటికే అభిషేక్‌తో పాటు ప్రధాన నిందితుడు వికాస్ భరద్వాజ్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 26 ఏళ్ల లక్ష్య చౌహాన్ తన ఇద్దరు స్నేహితులు వికాస్ భరద్వాజ్, అభిషేక్‌లతో కలిసి జనవరి 22న హర్యానాలోని సోనేపట్‌లో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. అతను మరుసటి రోజు ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఔటర్-నార్త్ ఢిల్లీలో ACP (ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తోన్న అతని తండ్రి యశ్‌పాల్ సింగ్ జనవరి 23న మిస్సింగ్ కంప్లయిట్ చేశారు. విచారణ అనంతరం ఫిర్యాదులో.. అపహరణగామార్చారని ఒక అధికారి తెలిపారు.

తీస్ హజారీ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న లక్ష్య తన వద్ద కొంత అప్పు తీసుకున్నాడని, తన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరినపుడు అతను తనతో అనుచితంగా ప్రవర్తించాడని వికాస్.. అభిషేక్‌తో చెప్పాడు. దీంతో తమ స్నేహితున్ని హర్యానాలోని మునక్ కాలువలోకి విసిరేయాలని, అంతమొందించేందుకు వారిద్దరూ పథకం వేశారు. సోమవారం మధ్యాహ్నం వారు ముఖర్బా చౌక్ నుండి వారు ప్రయాణం ప్రారంభించారని, అక్కడ లక్ష్య అభిషేక్‌ను కారులో కలిశాడని.. అభిషేక్.. లక్ష్యతో పాటు కారులో వెళ్లగా.. ఆ తరువాత వికాస్ కూడా వారితో చేరాడని డీసీపీ చెప్పారు. తిరుగు ప్రయాణంలో ఈ నేరం జరిగిందన్నారు.

అర్ధరాత్రికి, వారు భివానీలో వివాహ కార్యక్రమానికి చేరుకున్నారని, అర్ధరాత్రి 12 గంటల తర్వాత వారు మళ్లీ బయలుదేరారని డీసీపీ చెప్పారు. ఆ తర్వాత పానిపట్‌లో కాసేపు ఆగి, ఆ ముగ్గురూ కాస్త రిలీఫ్ కోసం కారు దిగారన్నారు. అవకాశాన్ని చూసుకుని అభిషేక్, వికాస్.. లక్ష్యని కాలువలోకి నెట్టి, అతని కారులో సంఘటనా స్థలం నుండి పారిపోయారని చెప్పారు. ఆ తరువాత వికాస్.. అభిషేక్‌ను నరేలాలో దింపి, అతను తప్పించుకున్నాడనిని చెప్పారు. పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీలోని 302 (హత్య), 201 (సాక్ష్యం అదృశ్యం కావడం) సెక్షన్‌లను చేర్చినట్లు అధికారి తెలిపారు. ప్రధాన నిందితుడు వికాస్‌ను ఆదివారం అరెస్టు చేశామని, నేరానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. తాజాగా హర్యానాలోని సమల్ఖా సమీపంలోని కాలువ నుండి మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అభిషేక్‌ను అరెస్టు చేయడంతో పాటు మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలించినట్లు పోలీసులు వివరించారు.