- ఢిల్లీ.. గెలిచెన్.. 3 వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం
- రాణించిన అక్షర్, మిల్లర్
- ప్రియాన్షు, శ్రేయస్ హాఫ్ సెంచరీలు వృథా
- పంజాబ్‌కు వరుసగా నాలుగో ఓటమి
ధర్మశాల: రికార్డ్ ఛేజింగ్‌లో అద్భుతంగా పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్–19లో కీలక విజయాన్ని సాధించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (30 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), డేవిడ్ మిల్లర్ (28 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) చెలరేగడంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.
ఇక నాకౌట్ రేసులో ఉన్న పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 210/5 స్కోరు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), ప్రియాన్షు ఆర్యా (33 బాల్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలు సాధించారు. తర్వాత ఢిల్లీ 19 ఓవర్లలో 216/7 స్కోరు చేసింది. మాధవ్ తివారీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్టార్క్‌ను ఆడుకున్న ప్రియాన్షు..
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే చుక్కెదురైంది. పంజాబ్ ఓపెనర్ ప్రియాన్షు ఆర్యా తొలి ఓవర్ నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మిచెల్ స్టార్క్ (2/57) వేసిన మొదటి ఓవర్‌లోనే రెండు సిక్సర్లతో సహా ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. లుంగీ ఎంగిడి, ముఖేష్ కుమార్ (1/31)ను లక్ష్యంగా చేసుకుని సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి మూడు ఓవర్లలోనే 51 పరుగులు సమర్పించుకున్న ఢిల్లీ ఆ తర్వాత వ్యూహాన్ని మార్చింది.
అకీబ్ నబీ లెంగ్త్ బాల్స్‌తో పంజాబ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18)ను ముఖేష్ కుమార్ వెనక్కి పంపగా, ప్రమాదకరంగా మారిన ప్రియాన్షు వికెట్‌ను 9వ ఓవర్‌లో మాధవ్ తివారీ (2/40) పడగొట్టాడు. దీంతో ఒక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. ఈ టైమ్‌లో శ్రేయస్, కూపర్ కనోలీ (38) ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిలో పెట్టారు. దాదాపు 9 ఓవర్ల పాటు ఢిల్లీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. స్ట్రయిక్ రొటేషన్‌తో పాటు వీలైనప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు కొట్టారు.
ఈ క్రమంలో శ్రేయస్ 32 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. మూడో వికెట్‌కు 83 పరుగులు జత చేసి 18వ ఓవర్‌లో కనోలీ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో స్టార్క్ వరుస బంతుల్లో స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0)లను అవుట్ చేశాడు. చివర్లో సూర్యాన్ష్ షెడ్జ్ (8 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ స్కోరు 200 దాటింది. ఎంగిడి వేసిన ఆఖరి ఓవర్‌లో కేవలం 7 పరుగులే రావడంతో పంజాబ్ 210 పరుగులకే పరిమితమైంది.
చివరి వరకు పోరాటం..
ఛేజింగ్‌లో ఢిల్లీని పంజాబ్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ (2/21) లైన్ అండ్ లెంగ్త్‌తో డీసీ టాప్ ఆర్డర్‌ను భయపెట్టాడు. ఫలితంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్ (9)ను, ఐదో ఓవర్‌లో సాహిల్ పారక్ (13)ను ఔట్ చేశాడు. మధ్యలో యష్ ఠాకూర్ (2/49).. అభిషేక్ పోరెల్ (5) వికెట్ తీయడంతో డీసీ 33/3తో కష్టాల్లో పడింది.
ఈ దశలో ట్రిస్టాన్ స్టబ్స్ (12), కెప్టెన్ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ 47/3తో పవర్‌ప్లేను ముగించిన ఢిల్లీకి 9వ ఓవర్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టబ్స్ రనౌట్ కావడంతో నాలుగో వికెట్‌కు 41 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. డేవిడ్ మిల్లర్‌తో కలిసి అక్షర్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ క్రమంలో 11.1 ఓవర్లలో స్కోరు 100కు చేరింది. ఇక్కడి నుంచి జోరు పెంచిన అక్షర్ 28 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న టైమ్‌లో స్టోయినిస్ మళ్లీ దెబ్బతీశాడు.
అక్షర్‌ను ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు 64 రన్స్ కీలక భాగస్వామ్యం ముగిసింది. 15 ఓవర్లలో స్కోరు 143/5గా మారింది. చేయాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో మిల్లర్, అశుతోష్ శర్మ (24) బ్యాట్లు ఝుళిపించారు. 16వ ఓవర్‌లో 4, 6,4 కొట్టిన మిల్లర్ తర్వాతి ఓవర్‌లో సిక్స్ కొట్టి వెనుదిరిగాడు. 27 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఆరో వికెట్‌కు 32 రన్స్ జతయ్యాయి. ఆ తర్వాత మాధవ్ తివారీ (18 నాటౌట్) 4, 6, 4 కొట్టగా, అశుతోష్ 6, 6 దంచి ఔటయ్యాడు. చివర్లో అకీబ్ నబీ (10 నాటౌట్) రెండు ఫోర్లతో డీసీని గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 210/5 (శ్రేయస్ 59*, ప్రియాన్షు 56, స్టార్క్ 2/57, మాధవ్ 2/40).
ఢిల్లీ: 19 ఓవర్లలో 216/7 (అక్షర్ పటేల్ 56, మిల్లర్ 51, అర్ష్‌దీప్ 2/21).
