
- యజమానురాలు తిట్టిందని.. గొంతు కోసి చంపేసిండు
- ఆమె టీనేజ్ కొడుకునూ హత్య చేసిన పనిమనిషి
- ఢిల్లీలో దారుణం.. నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. తిట్టారనే కోపంతో తాను పనిచేసే ఇంటి యజమానురాలిని, ఆమె మైనర్ కొడుకును చంపాడో పని మనిషి. కుల్దీప్ సెవానీ(44), రుచిక సెవానీ(42) దంపతులు వారి కొడుకు క్రిష్(14)తో కలిసి లజ్‌పత్ నగర్‌లో నివసిస్తున్నారు. రుచిక తన భర్తతో కలిసి బట్టల దుకాణం నడుపుతున్నది. బిహార్‌కు చెందిన ముఖేశ్(24)..వారి షాప్ లో హెల్పర్ కమ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నమ్మకంగా ఉంటున్నాడు.
బుధవారం సాయంత్రం ముఖేశ్ ను రుచిక తిట్టింది. తమ నుంచి తీసుకున్న రూ. 40 వేల అప్పును వెంటనే తిరిగివ్వాలని అడిగింది. దీంతో అతను కోపంలో రుచికను ఆమె కొడుకు క్రిష్ ను గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి 9:30 గంటలకు కుల్దీప్.. ఆఫీసు పని ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు మూసి ఉండటం గమనించాడు. భార్య, కొడుకు క్రిష్‌కు ఫోన్ చేశాడు.
కానీ, ఇద్దరూ రెస్పాండ్ రాలేదు. కుల్దీప్ తన ఇంటి గేటు దగ్గర, మెట్లపై రక్తపు మరకలు గుర్తించి వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్) కు ఫోన్ చేశాడు. తన భార్య, కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి రుచిక, క్రిష్ చనిపోయి ఉన్నారు. రుచిక బెడ్‌రూమ్‌లో, క్రిష్ బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో కనిపించారు.
తల్లీకొడుకు డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి పంపిన పోలీసులు..ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ హత్యలను ముఖేశ్ చేసినట్లు నిర్ధారించారు. సిటీ వదిలి పారిపోతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే ఇద్దరినీ చంపినట్లు ముఖేశ్ అంగీకరించాడు.