ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే గవర్నమెంట్ బ్యాంకు జాబ్కు రిజైన్.. ఏమైందమ్మా అని అడిగితే..

ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే గవర్నమెంట్ బ్యాంకు జాబ్కు రిజైన్.. ఏమైందమ్మా అని అడిగితే..

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది లక్షల మంది కల. ఆ కలను నిజం చేసుకోవడానికి కొందరు కోచింగ్ సెంటర్లలో గంటల తరబడి చదువుతూ లక్ష్య సాధన కోసం పరితపిస్తుంటారు. కొందరైతే.. తమ విద్యార్హతకు అవకాశం ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు రాస్తుంటారు. సంవత్సరాలకు సంవత్సరాలు ఇలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ ఉద్యోగమే టార్గెట్గా పెట్టుకున్న అభ్యర్థులకు మన దేశంలో కొదవే లేదు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ 29 ఏళ్ల వాణి అనే యువతి మూడేళ్లకే తన కొలువును బంద్ చేసింది.

అయ్యయ్యో.. ఎందుకిట్ల చేసిందనే ప్రశ్నకు వాణి తన ఇన్ స్టాగ్రాం అకౌంట్లో ఒక వీడియోను పోస్ట్ చేసి మరీ సవివరంగా సమాధానం చెప్పింది. 2022లో వాణి బ్యాంకు ఎగ్జామ్ క్లియర్ చేసింది. ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందింది. మీరట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్కేల్-1 ఆఫీసర్గా ఉద్యోగంలో చేరింది. దాదాపు మూడేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ ఉద్యోగం తనకు మంచి సంపాదన ఇచ్చిందని, ఫైనాన్షియల్ ఫ్రీడం ఇచ్చిందని చెప్పిన ఆమె మానసికంగా తనను కుంగదీసిందని, ఎంత కష్టపడినా కృతజ్ఞత కరువైన ఉద్యోగం అయిపోయిందని వాణి తన వీడియోలో వివరించింది. ఈ ఉద్యోగంలోకి రాక ముందు తాను చాలా హ్యాపీగా ఉండేదానినని.. కానీ గడచిన మూడేళ్లుగా చిన్నచిన్న విషయాలకే చిరాకు, కోపం తనలో కనిపిస్తున్నాయని తెలిపింది.

►ALSO READ | పుతిన్ డైనమిక్ లీడర్: భారత్-రష్యా సంబంధాలపై పాక్ పీఎం కీలక వ్యాఖ్యలు

బ్యాంకు ఉద్యోగాలు సాధించాలని భావిస్తున్న వారిని నిరుత్సాహపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని కానీ తన పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండేందుకే జాబ్కు రిజైన్ ఇచ్చానని ఆమె తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం పట్ల తనకు ఏమాత్రం పశ్చాతాపం లేదని.. ఈ నిర్ణయం తర్వాత సంతోషం, మానసిక ప్రశాంతత పొందానని ఆమె చెప్పింది. ఆమె తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 5.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లక్షా 29 వేల లైక్స్ వచ్చాయి.