హసన్ పర్తి, వెలుగు: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)కు ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్- లార్జ్ డిస్కమ్ అవార్డు రావడం హర్షణీయమని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 12న ఢిల్లీలో నిర్వహించిన 19వ ఇండియా ఎనర్జీ సమ్మిట్,13వ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఫర్ డిస్కమ్స్ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సి. ప్రభాకర్ అవార్డును స్వీకరించారు. బుధవారం నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్లు అవార్డును సీఎండీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, నెట్వర్క్ కెపాసిటీ విస్తరించడం, వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
సంస్థలోని ఉద్యోగుల కృషితోనే అవార్డు వచ్చిందన్నారు. డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్ లాల్, కె. తిరుమల్ రావు, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, కె.రాజు చౌహాన్, అశోక్ , వెంకట రమణ, జాయింట్ సెక్రటరీ కె. రమేశ్, సెక్రటరీ కె. వెంకటేశం పాల్గొన్నారు.
