- ప్రశంసలు అందుకున్న డెలివరీ బాయ్
ఎల్బీనగర్, వెలుగు: ఓ డెలివరీ బాయ్ తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. నాగోల్ బండ్లగూడకు చెందిన ప్రశాంత్ అనే మెడికల్ షాపు నిర్వాహకుడు మంగళవారం ఉదయం బైక్‌పై అప్పు తీర్చడానికి వెళ్తుండగా, నాగోల్ చౌరస్తా సమీపంలో అతడి బ్యాగ్ నుంచి రూ.2 లక్షలు కింద పడిపోయాయి.
ఈ క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న షైక్ వాలీకి రోడ్డుపై ఆ డబ్బు దొరికింది. రూపాయిపై కూడా ఆశపడకుండా అతడు ఆ మొత్తాన్ని తీసుకెళ్లి వెంటనే నాగోల్ పోలీసులకు అప్పగించాడు.
కొద్దిసేపటికి డబ్బులు పోగొట్టుకున్న ప్రశాంత్ కూడా ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు రాగా, పోలీసులు వాలీని పిలిపించి అతని చేతుల మీదుగానే ఆ నగదును ప్రశాంత్‌కు అందజేశారు. షైక్ వాలీ నిజాయితీని అభినందిస్తూ నాగోల్ సీఐ మగ్బుల్ జానీ అతనికి సన్మానం చేసి, రివార్డు అందజేశారు.
