85 దేశాల్లో డెల్టా కరోనా

85 దేశాల్లో డెల్టా కరోనా
  • చాలా వేగంగా అంటుతోందన్న డబ్ల్యూహెచ్​వో
  •  ఐసీయూ కేసులు ఎక్కువైతయ్​
  •  ఆక్సిజన్​ కూడా ఎక్కువ కావాలె
  • ఫైజర్​, ఆస్ట్రాజెనికా టీకాలు బాగా పనిచేస్తున్నయ్​
  • దేశంలో డెల్టా ప్లస్​ వేరియంట్​తో తొలి మరణం

న్యూఢిల్లీ: ‘డెల్టా’ కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 85 దేశాల్లో డెల్టా రకం కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపం చ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే దాని ముప్పు మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 170 దేశాల్లో ఆల్ఫా వేరియంట్​ కేసులున్నాయని చెప్పింది. వాటిలోనే  బీటా 119 దేశాల్లో, గామా వేరియంట్ కేసులు​71 దేశాల్లో నమోదైనట్టు తెలిపింది. ఈ వేరియంట్ల వ్యాప్తిని పరిశీలిస్తున్నామని చెప్పింది. వీక్లీ కరోనా రిపోర్ట్​లో డబ్ల్యూహెచ్​వో ఈ విషయాలను వెల్లడించింది. 

ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్​ చాలా డేంజర్​ అని, చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలో ఇండియాలోనే ఎక్కువగా 4,41,976 కేసులు వచ్చాయని, 16,329 మరణాలు నమోదయ్యాయని చెప్పిం ది. అయితే, అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 30%, మరణాలు 31% తగ్గాయంది. 
ఆక్సిజన్​ బాగా కావాలె
డెల్టా వేరియంట్​ కేసులు పెరిగితే ఆక్సిజన్​ అవసరం బాగా పెరుగుతుందని, ఐసీయూ చికిత్సలూ పెరుగుతాయని హెచ్చరించిన సింగపూర్​ స్టడీని డబ్ల్యూహెచ్​వో గుర్తు చేసింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్​ ఆర్​ (రిప్రొడక్షన్​– వ్యాప్తి) వాల్యూ ఎక్కువగా ఉందని చెప్పింది. డెల్టా వేరియంట్​పై ఫైజర్​, ఆస్ట్రాజెనికా టీకాలు బాగా పనిచేస్తున్నట్టు స్టడీల్లో తేలిందని పేర్కొంది. రెండు డోసులు వేసుకున్న 14 రోజుల తర్వాత ఫైజర్​ వ్యాక్సిన్​తో డెల్టా నుంచి 96 శాతం, ఆల్ఫా నుంచి 95 శాతం రక్షణ వస్తోందని చెప్పింది. అదే ఆస్ట్రాజెనికాతో టీకాతో 94 శాతం, 83 శాతంగా ఉందని పేర్కొంది. ఒక్క డోసు వేసుకున్న తర్వాత కూడా ఫైజర్​ వ్యాక్సిన్​తో డెల్టా నుంచి 94శాతం, ఆల్ఫా నుంచి 83 శాతం రక్షణ ఉంటోందని పేర్కొంది. ఆస్ట్రాజెనికా టీకాతో కూడా దాదాపు అదే స్థాయిలో కరోనా వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తోందని తెలిపింది. 
యూరప్​కు డెల్టా ముప్పు: ఏంజెలా మెర్కెల్​
యూరప్​ దేశాలకు డెల్టా వేరియంట్​ రూపంలో ముప్పు పొంచి ఉందని జర్మనీ చాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ అన్నారు. పార్లమెంట్​లో ఆమె చివరి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూరప్​ దేశాల్లో వ్యాక్సినేషన్​ వేగం పుంజుకుని కరోనా కేసులు తగ్గాయని, అయినా కూడా అక్కడితోనే ఆగిపోవద్దని ఆమె హెచ్చరించారు. ఆగస్టు చివరి నాటికి యూరప్​ దేశాల్లో నమోదయ్యే కొత్త కేసుల్లో డెల్టా వేరియంట్​ కేసులే 90 శాతం దాకా ఉంటాయని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో 15 శాతం ఉంటున్నాయన్నారు. 
దేశంలో తొలి డెల్టా ప్లస్​ డెత్​ 
భోపాల్​: దేశంలో డెల్టా ప్లస్​ వేరియంట్​తో తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి చెందిన 59 ఏండ్ల మహిళ ఆ డెల్టా ప్లస్​ కరోనాతో మరణించింది. ఆ రాష్ట్ర మెడికల్​ ఎడ్యుకేషన్​ మంత్రి, ఉజ్జయిని కలెక్టర్​ ఆశిష్​ సింగ్​లు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మే 23న ఆమె కరోనాతో మరణించిందని, శాంపిళ్లను టెస్ట్​ చేయగా డెల్టా ప్లస్​ వేరియంట్​గా తేలిందని కలెక్టర్​ చెప్పారు. భోపాల్​లో 3, ఉజ్జయినిలో 2 డెల్టా ప్లస్​ కేసులు వచ్చాయన్నారు. ప్రస్తుతం దేశంలో 40కిపైగా డెల్టా ప్లస్​ వేరియంట్​ కేసులున్నాయి. ప్రపంచంలోని 11 దేశాల్లో డెల్టా ప్లస్​ కేసులు నమోదయ్యాయి. 197 మంది దాని బారిన పడ్డారు.