తెలంగాణలో 68 శాతం డెల్టా కేసులే

తెలంగాణలో 68 శాతం డెల్టా కేసులే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌‌కు కారణమైన డెల్టా వేరియంట్‌‌ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి నెల 50 శాతానికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌‌ వల్లే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వేరియంట్లను తెలుసుకునేందుకు ప్రతి నెల కొన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ర్యాండమ్‌‌గా శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఈ ఏడాది జులై నుంచి నవంబర్ వరకు 1,538 శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేయించారు. వీటిలో అత్యధికంగా 1,055 (68.6%) కేసులకు డెల్టా వేరియంటే కారణమని తేలింది. ఒకే ఒక్క డెల్టా ప్లస్ కేసు నమోదైంది. కరోనా వేరియంట్ల తీవ్రత, వ్యాప్తిని బట్టి వాటిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌‌ (వీవోసీ), వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్‌‌ (వీవోఐ)లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) విభజించింది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వేరియంట్లను వీవోసీ కేటగిరీలో.. గామా, ఈటా, జీటా, ఎప్సిలాన్‌‌, లాంబ్డా తదితర వేరియంట్లను వీవోఐ కేటగిరీలో చేర్చింది. మన రాష్ట్రంలో అత్యధికంగా వీవోసీ జాబితాలోని వేరియంట్లే వ్యాప్తిలో ఉన్నాయి. ఐదు నెలల్లో చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రకారం.. స్టేట్‌‌లో నమోదైన 96.55% కేసులకు వీవోసీలే కారణమని తేలింది. వీవోఐ జాబితాలోని వేరియంట్ల వ్యాప్తి 4 శాతం లోపే ఉండడం గమనార్హం. 

ఒమిక్రాన్​పై అలర్ట్... 
ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఎక్కువ శాంపిళ్లను పంపిస్తున్నారు. మూడ్రోజుల్లో 50 శాంపిళ్లను పంపామని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. ఇవన్నీ విదేశాల నుంచి వచ్చిన వాళ్లవే కావడం గమనార్హం. 47 శాంపిళ్లను ఎయిర్‌‌‌‌పోర్టులోనే సేకరించగా, 2 శాంపిళ్లను నల్గొండ నుంచి, మరో శాంపిల్‌‌ను రంగారెడ్డి జిల్లా నుంచి సేకరించినట్టు తెలిసింది. వీటి రిపోర్టులు రావాల్సి ఉంది. విదేశాల నుంచి వస్తున్నవాళ్లకు నెగెటివ్ వచ్చినప్పటికీ, ర్యాండమ్‌‌గా కొంతమంది శాంపిళ్లను సేకరించి సీక్వెన్సింగ్​కు పంపిస్తున్నట్టు ఆఫీసర్లు చెప్పారు.