96 దేశాలకు విస్తరించిన డెల్టా వేరియంట్

96 దేశాలకు విస్తరించిన డెల్టా వేరియంట్

రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుందని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ కనిపించిందని తెలిపింది. అయితే, చాలా దేశాల్లో జన్యు క్రమ విశ్లేషణ సామర్థ్యాలు తక్కువగా ఉండడంతో డెల్టాను గుర్తించడం కష్టమవుతోందని.. ఇంకా చాలా దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ కేసులు ఉండి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ ఉన్న దేశాల్లో కేసులు పెరుగుతున్నాయంది. దీంతో చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారని చెప్పింది. రాబోయే రోజుల్లో ఇతర వేరియంట్లను డెల్టా అధిగమించేస్తుందని తెలిపింది.

వేరియంట్ల వ్యాప్తి పెరిగేకొద్దీ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలకు తెలిపింది WHO. ఇప్పటికీ చాలా దేశాల్లో టీకా కార్యక్రమం చాలా నెమ్మదిగా సాగుతోందని.. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించింది.