అనుకున్న లక్ష్యం చేరుకుంటే.. రూ.3,500 కోట్ల ప్రాఫిట్

అనుకున్న లక్ష్యం చేరుకుంటే.. రూ.3,500 కోట్ల ప్రాఫిట్

 

  • 2024, మార్చి నాటికి 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి: సీఎండీ శ్రీధర్
  • దసరా పండుగకు ముందే లాభాల వాటా చెల్లిస్తామని వెల్లడి

దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ ఉందని, 2023–24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన టార్గెట్ రీచ్ కావాలని అధికారులకు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి చేరుకుంటే.. రూ.3,500 కోట్ల లాభాలు వస్తాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి, రవాణాపై చర్చించారు. 2024, మార్చి నాటికి 720 లక్షల టన్నుల వార్షిక లక్ష్యం దాటాలన్నారు. దీని కోసం మిగిలిన ఆరు నెలల్లో రోజుకు కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్నవిధంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలు సాధిస్తే సింగరేణి సంస్థ రూ.40వేల కోట్ల టర్నోవర్​తో రూ.3,500 కోట్ల భారీ లాభాలు పొందే చాన్స్ ఉంటుందని సీఎండీ శ్రీధర్ వివరించారు. 

ఇప్పటికే అన్ని పర్మిషన్లు ఇచ్చినం

అన్ని ఏరియాలకు అవసరమైన మిషన్లకు పర్మిషన్లు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చినట్లు సీఎండీ శ్రీధర్ చెప్పారు. ఓపెన్​కాస్ట్ గనుల్లో నిలిచిన నీళ్లను వారం రోజుల్లో బయటికి తోడేయాలని ఆదేశించారు. సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.1,750 కోట్ల వేతన ఒప్పంద బకాయిలు చెల్లించామన్నారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా ఉద్యోగులకు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లను దసరా పండుగకు ముందే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. దీపావళి బోనస్ కూడా పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.

 సింగరేణి సంస్థ ఏప్రిల్ 2023 నుంచి సెప్టెంబర్ వరకు నిర్దేశిత బొగ్గు రవాణా 307 లక్షల టన్నులకు గాను 330 లక్షల టన్నుల లక్ష్యం దాటిందన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 314 లక్షల టన్నులు సాధించి వందశాతం సాధించిందన్నారు. రివ్యూ మీటింగ్​లో సింగరేణి డైరెక్టర్లు ఎన్.బలరామ్​నాయక్ (పర్సనల్, ఫైనాన్స్),  డి.సత్యనారాయణ (ఈఎం), ఎన్​వీకే శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి.వెంకటేశ్వర రెడ్డి (ప్లానింగ్, ప్రాజెక్ట్), సలహాదారు సరేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​జి.ఆల్విన్ (కోల్​మూమెంట్), జీఎంలు ఎం.సురేశ్, జక్కం రమేశ్, మల్లెల సుబ్బారావు, దేవేందర్, మోహన్​రెడ్డి, కార్పొరేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.