పర్మినెంట్ చేయాలని సెకండ్ ఏఎన్ఎంల రాస్తారోకో

పర్మినెంట్ చేయాలని సెకండ్ ఏఎన్ఎంల రాస్తారోకో

ఆసిఫాబాద్, వెలుగు : ఎలాంటి షరతులు లేకుండా తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సెకండ్ ఏఎన్ఎంలు సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్​లోని అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.13 రోజుగా సమ్మె చేస్తున్నా గవర్నమెంట్ స్పందించడం లేదని మండిపడ్డారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం తో పాటు వివిధ రకాల ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 

లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, ఏఎన్ఎంల రాష్ట్ర నాయకురాలు వసంత, జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.