ఫీజుల విడుదల కోసం..10న కలెక్టరేట్ల ముట్టడి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఫీజుల విడుదల కోసం..10న కలెక్టరేట్ల ముట్టడి  : ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ఫీజుల బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాలేజీ స్టూడెంట్స్​కు స్కాలర్ షిప్​ను రూ.5,500 నుంచి రూ.20వేలకు పెంచాలని డిమాండ్​చేస్తూ 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తున్నట్టు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఆ సంఘం స్టేట్​ ప్రెసిడెంట్​ జిల్లపల్లి అంజి, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. నవంబర్ 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా క్లాసులు బహిష్కరించి 18 డిమాండ్లతో కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎంఆర్​ఓ ఆఫీసులను ముట్టడించాలన్నారు. రెండేండ్లుగా పెండింగ్​లో ఉన్న రూ.3,30‌‌0 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. అదేవిధంగా వృత్తి విద్య కోర్సులు చేసే ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు పూర్తి ఫీజు బకాయిలు చెల్లించాలన్నారు. బీసీ స్టూడెంట్స్​కు చదువు దూరం చేసేలా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్టూడెంట్స్​ అందరికీ ఒకేరకమైన ఫీజు చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇవ్వాలని, బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే స్టూడెంట్స్​ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో నీల వెంకటేశ్, భాస్కర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.