నాంపల్లిలో పాలిటెక్నిక్​ విద్యార్థుల ధర్నా... ప్రమోట్​ చేయాలని డిమాండ్​

నాంపల్లిలో పాలిటెక్నిక్​ విద్యార్థుల ధర్నా... ప్రమోట్​ చేయాలని డిమాండ్​

హైదరాబాద్ : నాంపల్లిలోని సాంకేతిక విద్య డైరెక్టర్​ కార్యాలయం ముందు పాలిటెక్నిక్​ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారుల తప్పిదం కారణంగా తాము పరీక్షలు రాయలేకపోతున్నామని తద్వారా ఏడాది పాటు విద్యాసంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హాజరు శాతం తక్కువగా ఉందని కండోనేషన్​ ఫీ పేరుతో తమ నుంచి ఫీజులు వసూలు చేసి ఇప్పడు పరీక్షలకు అనుమతించకపోవడంపై నిరసన తెలిపారు. ఇప్పటికే మూడు పరీక్షలు అయిపోయాయని తమ కంటే తక్కువ హాజరు శాతం ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ప్రమోట్​ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను బ్యాక్​లాగ్​లో పూర్తి చేసుకుంటామని విఙప్తి చేశారు.  కాగా ఈ విషయంపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అసిస్టెంట్​ డైరెక్టర్​హామీ ఇచ్చారు.

ప్రమోట్​ చేయండి..

"జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్న మా ఆశలపై అధికారులు నీళ్లు జల్లారు. పరీక్షలకు అనుమతించకపోవడంతో విద్యాసంవత్సరం నష్టపోతాం.  దయచేసి మమ్మల్ని ప్రమోట్​ చేయండి."  అని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది.

అధికారుల దురుసు ప్రవర్తన...

మా కుమార్తె అనారోగ్యం కారణంగా 20 రోజులు కాలేజీకి వెళ్లలేదు. దీంతో అటెండెన్స్​ తక్కువైందనే కారణంతో హాల్​ టికెట్​ కూడా ఇవ్వలేదు. అప్పటినుంచి మాసబ్​ట్యాంక్​కార్యాలయానికి నిత్యం తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. అధికారులను అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులను బయటికి వెళ్లగొడుతున్నారు.