
- కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి
- కంపెనీలు పన్ను కోత ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలి: మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్ల తగ్గింపును వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేయాలని పరిశ్రమలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు. దీని వల్ల దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు. ‘‘జీఎస్‌టీ రేట్లు తగ్గించడం, ప్రాసెస్‌ను సులభతరం చేయడం వల్ల చిన్నా పెద్దా సంస్థలకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఇవి అన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళతాయి” అని గోయల్ పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ శక్తీ భారత్‌ను ఆపలేదని, దేశం త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పిలుపును అందరు స్వీకరించాలని, స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఎగుమతులు 1955 లో కేవలం 10 మిలియన్ డాలర్లు ఉంటే ప్రస్తుతం 116 బిలియన్ డాలర్లకు చేరాయని గోయల్ అన్నారు.
“జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’’ మంత్రంతో భారత్ ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్నారు.భారత్‌ను ప్రపంచం నమ్మదగిన భాగస్వామిగా చూస్తోందని, ఈ స్థాయిని నిలుపుకోవడం అవసరమని గోయల్ తెలిపారు. సీఓపీ21 ప్రకారం భారత్ గ్రీన్ కమిట్‌మెంట్లలో టాప్ 3లో నిలిచిందని గుర్తుచేశారు.