మోడీ రాజీపడతారని చైనాకు తెలుసు

మోడీ రాజీపడతారని చైనాకు తెలుసు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. మోడీకి దేశ ఆసక్తుల మీద పట్టింపు లేదని ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తూత్తుకుడిలోని వీవోసీ కాలేజీలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందని ఆయన దుయ్యబట్టారు.

‘మన దేశ ఆసక్తుల విషయంలో మోడీ రాజీపడతారని చైనాకు తెలుసు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోంది. ప్రజాస్వామ్య సంస్థలపై ఓ పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయి. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. గత ఆరేళ్లుగా మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఈ విషయాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ఎక్కువగా ఉంది. దేశంలోని పలు సంస్థల మధ్య సమతూకాన్ని ఆర్ఎస్ఎస్ నాశనం చేసింది. భారత్ పలు రాష్ట్రాల సమాహారం. కానీ ఇన్‌స్టిట్యూషన్స్‌‌ను నాశనం చేస్తూ, రాష్ట్రాలతో సంబంధాలను విడగొడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇదే మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య’ అని రాహుల్ మండిపడ్డారు.