ప్రజాస్వామ్యంలో పెచ్చరిల్లుతున్న ఓటుకు నోటు సంస్కృతి

ప్రజాస్వామ్యంలో పెచ్చరిల్లుతున్న ఓటుకు నోటు సంస్కృతి

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలితులు. ప్రజలే ఓటర్లు. ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు. ఓటు, ఎన్నిక, మెజార్టీ, అధికారం.. ఇవే ప్రజాస్వామ్యానికి మూలాధారాలు. ఎన్నికల్లో నిలబడాలి. మెజార్టీ ఓట్లతో గెలవాలి. ఒక్క ఓటు తేడాతో ప్రజాప్రతినిధి కావొచ్చు. అధికారం చేపట్టొచ్చు. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని చాటుతాం. ఓటే వజ్రాయుధం అని నినదిస్తాం. అలాంటి ఓటు నేటి కాలంలో రాజకీయ పార్టీల నోట్ల కట్టలకు లొంగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎన్నికల్లో నీతి, నిజాయతీతో కూడిన గెలుపుకంటే డబ్బుతో ఓట్లను కొని గెలిచే సంస్కృతి అంతకంతకూ పెరుగుతున్నది. మెజార్టీ ఓట్లను కొనుగోలు చేస్తే చాలు.. గెలుపు తమదే అనే ధోరణి రాజకీయ పార్టీల్లో హెచ్చుమీరుతున్నది. పదులు, వందల కోట్లలో డబ్బులు ఖర్చు చేసిన వారే చట్టసభల్లో అడుగుపెట్టే జాఢ్యం పెరుగుతున్నది. 

సంతలో పశువులను కొన్నట్టుగా..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా జరిగే ఎన్నికల్లో పాలకులను ఓటుతో నే ఎన్నుకునే ఎన్నికల వ్యవస్థ మనది. స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేసే హక్కును మన రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 326  ద్వారా18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి కుల, మత, ప్రాంతీయ, వర్గ, వివక్ష బేధం లేకుండా ఓటు హక్కు వచ్చింది. ఎన్నికలు వస్తే ముందుగా రాజకీయ పార్టీలు, నేతలు చేసే దుష్టాలోచన ఏమిటంటే.. ఓటర్లను ఎలా లొంగదీసుకోవాలి? ఏమిచ్చి ప్రలోభపెట్టాలి? ఓటర్లను సంతలో పశువులను కొన్నట్టుగా కొనడం.. కుల, మత ప్రాతిపదికగా గంపగుత్తగా వేయించుకోవడం దుష్ట రాజకీయ సంస్కృతికి సాక్షాత్కారంగా నిలుస్తున్నది.  

ప్రజాస్వామ్యానికే ప్రమాదమని..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ప్రచార ఖర్చులకు.. ఎమ్మెల్యే అభ్యర్థికైతే రూ. 25 లక్షల లోపు, లోక్ సభ అభ్యర్థికి రూ.75 లక్షల లోపు ఖర్చు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం చట్టప్రకారం కల్పించింది. అయితే ఈ ఖర్చులకు.. వాస్తవంగా అభ్యర్థులు పెడుతున్న ఖర్చులకు పొంతన ఉండటం లేదు. ఎన్నికల కమిషన్ అభ్యర్థులు ఖర్చులపైన నిఘా పెడుతున్నా.. విచ్చలవిడిగా సాగుతున్న డబ్బు, మద్యం పంపకాలు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. 

ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చుచేసి గెలిచిన అభ్యర్థులు, ఆ తర్వాత అధికార బలంతో అవినీతికి పాల్పడటం.. వందల కోట్లకు పడగలెత్తడం..  మానవాభివృద్ధి విఘాతకులుగా మారుతున్నారనే అభిప్రాయం ఉంది. తెలంగాణ వచ్చాక ఓటు రేటు కూడా పెరిగిపోయింది. ఎన్నికల్లో అత్యధికంగా డబ్బు ఖర్చు చేసే రాష్ట్రాల్లో తెలంగాణనే ముందంజలో ఉందని ఇటీవల ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఓట్లను కొనే సంస్కృతి ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం. 

భవిష్యత్ ను మార్చే ఆయుధమైనా.. 

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఓటు హక్కు ఒక్కటే మార్గం. తాయిలాలకు లొంగి ప్రశ్నించడం మరిచిపోతే.. ప్రగతి కుంటుపడుతుంది. ఓటుహక్కు దేశ భవిష్యత్ ను  మార్చే ప్రజా ఆయుధం. అందుకే ఓటును దుర్వినియోగం చేయకుండా తగిన ప్రాధాన్యతను గుర్తించి సరైన నాయకుడిని ఓటరు ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.  ఓట్లు వేయడాన్ని ప్రజలు రాజకీయ ప్రక్రియలో భాగంగానే చూస్తూ..  నోటు తీసుకుని ఓటు వేస్తే ప్రశ్నించే హక్కును కోల్పోతారనే విషయం మరిచిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజలు ఒక్కరోజు వేసే ఓటే.. వారి ఐదేళ్ల తలరాతను నిర్ణయిస్తుంది. రాజకీయాల తలరాతలను మార్చేదిగా ఓటు ఉండాలి. అలాకాకుండా.. నోటు తీసుకుని ఓటు వేస్తే.. జవాబుదారీతనం ఉండదు. 

అది రాజకీయ పార్టీలు, నేతల అక్రమాలకు తావిస్తుంది. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో, అతడిని ఎన్నుకునేందుకు ఓటరు అంతే ముఖ్యం! నా ఓటే.. నా భవిష్యత్ అనే చైతన్యం పెరగనంత కాలం.. ఓటును నోటుతో కొనుగోలు చేసినంతకాలం ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ఈ దిశగా ఓటర్లలో చైతన్యం తీసుకురావడం ఎంత ముఖ్యమో.. పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు రావాలి. రాజకీయ పార్టీల ఓట్ల కొనుగోలు వైఖరి మారే మౌలిక సంస్కరణలు, పటిష్ట నిబంధనలు రావాలి. 

ఎరకు చిక్కుతున్న ఓటరు దేవుళ్లు 

ఓటర్లను దేవుళ్లతో పోలుస్తుంటాం. కానీ.. రాజకీయ పార్టీలు నీతి, నైతికతకు సమాధి కట్టి.. డబ్బు, కండ, అధికార బలం ఓటర్లపై ప్రయోగిస్తూ.. మందు, మటన్, విందు తాయిలాలు పంచుతూ నిర్బంధంగా వేసేలా, నోటు తీసుకుని, ఆ తర్వాత వేయకుంటే ఏం చేస్తారోననే భయానక పరిస్థితుల్లోకి నెట్టివేశాయి.“ చేపలను పట్టాలంటే గాలానికి ఎరను గుచ్చి వేయాలి. ఎన్నికల్లో  గెలవాలంటే మనీ, మందు, మటన్ పంచి ఓటర్లను బుట్టలో వేసుకోవాలి. ఇలా ఓటర్లకు తాయిలాల ఎర చూపి.. చేపల లెక్కనే రాజకీయ పార్టీలు వల వేస్తున్నాయి. 

నోటు ఎర అని తెలిసినా ఓటర్లు ఆ ప్రలోభానికి తలొగ్గకుండా ఉండలేకపోతున్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చుకు లెక్కే లేకుండా పోయింది. తమ ఓటుకు ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీ  లాగా ఓ రేటు నిర్ణయించుకుని, అంతే ఇవ్వాలని పట్టుబడుతూ.. నేతలను నిలదీసే స్థాయికి ఓటర్లు వెళ్లడం ప్రజాస్వామ్యంలో ఇంతకంటే మరో విపత్కర పరిస్థితి ఉండదేమో! హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు రోడ్డెక్కి చేసిన ధర్నాలు, బైఠాయింపులు, ఆందోళనల సంఘటనలు మనకు ఇంకా గుర్తున్నాయి.

-వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్