ఆ కమర్షియల్ బిల్డింగ్ కూల్చేయండి : హైకోర్టు తీర్పు

ఆ కమర్షియల్ బిల్డింగ్ కూల్చేయండి :  హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు:  పాతికేళ్ల నాటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం పరిష్కరించింది. అప్పట్లో హైదరాబాద్‌‌, బేగంపేట్‌‌లో పార్కు నిర్మాణం కోసం కేటాయించిన 600 గజాల జాగాలో కమర్షియల్‌‌ కాంప్లెక్స్‌‌ కట్టడాన్ని తప్పుపట్టింది. ఆ బిల్డింగ్ ను మూడు నెలల్లోగా కూల్చివేయాలని అధికారులను ఆదేశించింది. ఆ స్థలంలో పార్కును డెవలప్‌‌ చేయాలని హెచ్‌‌ఎండీఏకు ఉత్తర్వులు జారీ చేసింది. బేగంపేటలోని ఇండియన్‌‌ ఎయిర్ లైన్స్‌‌ ఎంప్లాయీస్‌‌ హౌసింగ్‌‌ కాలనీలో పార్కు కోసం స్థలాన్ని ఏపీ హౌసింగ్‌‌ బోర్డు కేటాయించింది. లేవుట్‌‌ కూడా వేసింది. 

అయితే, ఆ స్థలంలో కమర్షియల్‌‌ కాంప్లెక్స్ నిర్మించడాన్ని సవాల్‌‌ చేస్తూ 1997, 1999లో పి. వెంకటేశ్వర్లు, నర్సోజి అనే వ్యక్తులు వేర్వేరుగా పిల్స్‌‌ దాఖలు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు.. ఆ బిల్డింగ్ ను కూల్చివేయాలని 1999లో ఉత్తర్వులు ఇవ్వడంతో భవన నిర్మాణదారులైన ఇద్దరు ప్రైవేట్‌‌ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అప్పటి నుంచి సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత బుధవారం హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రవణ్‌‌ కుమార్‌‌తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ తీర్పు వెలువరించింది. పార్కు ప్రజావసరాల కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. బిల్డింగ్ కూల్చివేతకు అయ్యే ఖర్చును నిర్మాణదారుల నుంచే వసూలు చేయాలని ఆదేశించింది.