
- హోటల్ బిల్డింగ్స్, ఇండ్లకు రెడ్ మార్కింగ్ చేసిన ఆఫీసర్లు
- మొత్తం 723 ఇండ్లకు బీటలు.. అన్ సేఫ్ జోన్లో 86 ఇండ్లు
- నష్టపరిహారం కోసం ప్రజలు, వ్యాపారుల నిరసన
న్యూఢిల్లీ/జోషిమఠ్: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ టౌన్లో నేల కుంగుతున్న ప్రాంతంలో ఉన్న ఇండ్లు, బిల్డింగుల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. టౌన్ లోని మొత్తం 723 ఇండ్లు బీటలువారినట్లు అధికారులు మంగళవారం గుర్తించారు. బీటల తీవ్రతను బట్టి కూల్చివేయాల్సిన బిల్డింగులకు రెడ్ మార్కింగ్ వేశారు. బుధవారం నుంచి బిల్డింగ్‌ల కూల్చివేతను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జోషిమఠ్ లోని మౌంట్ వ్యూ, మలారి ఇన్ హోటల్ బిల్డింగ్స్ రెండూ ఒకదానివైపు ఒకటిగా ఒరిగిపోయాయి. రెండు బిల్డింగ్ లకూ పెద్ద ఎత్తున బీటలు వచ్చాయి. చుట్టుపక్కల భవనాలకూ ముప్పు ఉన్నందున వీటిని కూల్చివేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కూల్చివేయనున్న ఈ రెండు హోటల్స్, ఇతర బిల్డింగ్ లు ఉన్న ఏరియాలో అధికారులు మంగళవారమే కరెంట్ సప్లై నిలిపేశారు. దీంతో ఈ ప్రాంతంలోని సుమారు 500 ఇండ్లకు పవర్ కట్ అయింది. ఇప్పటివరకు 131 కుటుంబాలను రిలీఫ్ సెంటర్లకు తరలించామని, 86 ఇండ్లను అన్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ప్రజలు, వ్యాపారుల నిరసనలు జోషిమఠ్‌లో హోటల్స్, ఇండ్ల కూల్చివేత విషయం న్యూస్ పేపర్లలో వార్తలు వచ్చిన తర్వాతే తెలిసిందని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేముందుకు తమకు నోటీసులు ఇచ్చి, తగిన నష్టపరిహారాన్ని ఆఫర్ చేయాల్సిందని హోటల్ నిర్వాహకులు, ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఉంటున్నామని, ఉన్నఫళంగా ఇండ్లను ఖాళీ చేయిస్తే తాము ఎక్కడికి పోవాలంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆర్మీ బిల్డింగ్లు ఖాళీ
జోషిమఠ్ లో ప్రజల భద్రతకే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. టౌన్‌లోని ఆర్మీ బిల్డింగ్లు కూడా ఖాళీ చేయించామని, ఆర్మీ జవాన్లను ఇతర ప్రాంతాలకు తరలించామని తెలిపారు. టౌన్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గర్వాల్ స్కౌట్స్, ఐటీబీపీ సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు.
ప్రకంపనల పరిశీలనకు మైక్రోసీస్మిక్ సిస్టం
జోషిమఠ్‌లో ఇకపై చిన్న చిన్న ప్రకంపనలను సైతం గుర్తించేందుకు వీలుగా మైక్రో సీస్మిక్ అబ్జర్వేషన్ సిస్టంలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. బుధవారం నుంచే వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు.
16న సుప్రీంకోర్టులో విచారణ
జోషిమఠ్ విపత్తును నేషనల్ డిజార్డర్‌గా ప్రకటించాలంటూ స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. ఈ నెల 16న దీనిపై విచారణ చేపడతామని తెలిపింది.
కర్ణప్రయాగ్, ఇతర టౌన్ లకూ ఇదే ముప్పు
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో జోషిమఠ్ మాది రిగానే కర్ణప్రయాగ్, గోపేశ్వర్ పట్టణాలతో పాటు తెహ్రీ జిల్లాలోని ఘన్సాలి, పితోరగఢ్ జిల్లాలోని మున్సియారీ, ధర్చూల, ఉత్తరకాశి జిల్లాలోని భట్వారి, పౌరి, నైనిటాల్ ప్రాంతాల్లోనూ నేల కుంగిపోయే ముప్పు ఉందని ఎక్స్ పర్ట్లు హెచ్చరించారు.
ఏటా ఆరున్నర సెం.మీ. కుంగుతున్నయ్!
జోషిమఠ్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏటా ఆరున్నర సెంటీమీటర్లు కుంగుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్‌సెన్సింగ్(ఐఐఆర్ఎస్) అధ్యయనంలో తేలింది. ఈమేరకు శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందని సైంటిస్టులు చెప్పారు. డెహ్రాడూన్‌కు చెందిన ఐఐఆర్ఎస్లో రెండేళ్లుగా ఈ పరిశోధన జరుగుతోందన్నారు.