ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

రఘునాథపాలెం మండలానికి చెందిన రైతు బానోత్​ సురేశ్​కు ఇటీవల జ్వరమొచ్చింది. ఆర్ఎంపీ సూచన మేరకు ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ ల్యాబ్​లో టెస్ట్  చేయించుకోగా, ప్లేట్ లెట్స్​ పడిపోయాయని చెప్పారు. ప్లేట్ లెట్స్​ ఎక్కించాలంటూ సురేశ్​ను అదే ఆర్ఎంపీ వైరా రోడ్​ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. మూడ్రోజుల ట్రీట్ మెంట్ తర్వాత రూ.25 వేల బిల్లు వేశారు. ఇలా చాలా మంది పేషెంట్లు వైరల్ ఫీవర్స్​తో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. 

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలో డెంగీ, విష జ్వరాల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా చాలా ఇండ్లలో జ్వర బాధితులు కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా పేషెంట్ల రద్దీ పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి గత నెల వరకు యావరేజీగా రోజుకు 1500 వరకు ఔట్ పేషెంట్లు వస్తుండగా, ఈ నెల మొదటి వారం నుంచి ఆ సంఖ్య 2 వేలకు పెరిగింది. మండలాల్లోని పీహెచ్​సీలకు కూడా తాకిడి పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ ల్యాబ్​లు, ఆసుపత్రుల్లో పేషెంట్ల నుంచి డెంగీ, మలేరియా పేరుతో వేలకు వేలు టెస్టులు, ఫీజుల కోసం వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, చాలా గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితుల వల్లే కేసులు పెరగడానికి కారణమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

అపరిశుభ్రతే కారణం..
జిల్లాలో దాదాపు రెండు నెలల నుంచి రెగ్యులర్​గా వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖాళీ ప్లాట్లలో నీళ్లు నిలవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడ బురద, మురుగు ఏర్పడింది. దీంతో దోమల వ్యాప్తి పెరిగి డెంగీ, విష జ్వరాల వ్యాప్తి పెరిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కలెక్టర్​ ఆదేశాలతో జిల్లాలో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే గా పాటిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నా, డెంగీ కేసుల నియంత్రణ సాధ్యం కావడం లేదని అధికారులే ఆఫ్​ ది రికార్డుగా చెబుతున్నారు. రెండేళ్ల క్రితం చింతకాని మండలం నాగులవంచ, గత ఏడాది కల్లూరు మండలం అంబేద్కర్​ నగర్​లో ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 110కి పైగా కేసులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోనే ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇటీవల అడిషనల్​ కలెక్టర్​ స్నేహలత మొగిలి, ఇతర అధికారులు రెగ్యులర్​ గా ఆ గ్రామంలో పర్యటించి కేసులు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.  

వైద్య శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాం
డెంగీ, టైఫాయిడ్ కేసులు కంట్రోల్ లోనే ఉన్నాయి. ఎక్కువ కేసులు నమోదవుతున్న పీహెచ్​సీల పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో కలిసి రెగ్యులర్​గా డ్రై డే నిర్వహిస్తూ దోమల వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. 
- డాక్టర్​ మాలతి, డీఎంహెచ్​వో, ఖమ్మం