
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా 'ఓజీ (They Call Him OG)' సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. దాదాపు రూ. 293 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ ఆనందంలో ఉండగానే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నారు.
దర్శకుడు సుజీత్‌కు, సినిమా నిర్మాత, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు మధ్య విభేదాలు వచ్చాయని, బడ్జెట్ విషయంలో గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకు, సుజీత్ తన రూ.6 కోట్ల పారితోషికంలో ఎక్కువ భాగాన్ని సినిమా పూర్తి చేయడానికి ఖర్చు చేశారని కూడా జోరుగా ప్రచారం జరిగింది.
నిర్మాతతో విభేదాలపై సుజీత్ క్లారిటీ!
ఈ పుకార్లపై 'ఓజీ' దర్శకుడు సుజీత్ మంగళవారం (అక్టోబర్ 22) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఎక్స్ పేజీలో సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. ఈ వార్తలన్నిటినీ ఆయన ఖండించారు. 'చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఒక సినిమాను మొదలుపెట్టి, ముగించడానికి ఎంత కష్టపడతారో, వెనుక ఎంత శ్రమ ఉంటుందో కొందరికే తెలుసు. 'ఓజీ' కోసం నా నిర్మాత, నా బృందం చూపించిన నమ్మకం, బలాన్ని మాటల్లో చెప్పలేను. అదే ఈ రోజు ఈ సినిమాకు ఇంతటి శక్తినిచ్చింది' అని సుజీత్ భావోద్వేగంతో రాసుకొచ్చారు. నిర్మాత డీవీవీ దానయ్యకు తన కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన అందించిన నిరంతర మద్దతు, నమ్మకాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది ఎవరికీ సులభం కాలేదు. కానీ ప్రతి ఒక్క ప్రయత్నం కట్టుబడి ఉన్న చోటు నుంచే వచ్చింది. దయచేసి దీనిని గౌరవించండి అని సుజీత్ కోరారు.
— Sujeeth (@Sujeethsign) October 21, 2025
పవన్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు!
తన కెరీర్‌లో తొలిసారిగా పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసిన సుజీత్.. ఈ సినిమాకు దక్కిన అద్భుతమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 'ఓజీ'పై అభిమానులు చూపించిన ప్రేమాభిమానాల కారణంగానే తమ ప్రయత్నం అంతా అర్థవంతంగా మారిందని చెప్పారు. పవన్ కల్యాణ్ అభిమానులందరికీ సుజీత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ యాక్షన్-డ్రామాలో పవన్ కల్యాణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి (విలన్‌గా), ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందించారు.
అక్టోబర్ 23న ఓటీటీలో 'ఓజీ'
కాగా.. 'ఓజీ' చిత్రం అక్టోబర్ 23న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. ఈ వివాదాల మధ్య ఓటీటీ రిలీజ్ రావడం, సినిమాను ఇంకెంత మంది ఆదరిస్తారో చూడాలి. ప్రస్తుతం సుజీత్, నేచురల్ స్టార్ నాని హీరోగా తన తదుపరి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో (Bloody Romeo)' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది డార్క్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌కు చెందిన సినిమా అని సమాచారం. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల పూర్తయింది.