
- గ్రామంలో జ్వరాల బారిన మరో 50 మంది
- అప్రమత్తమైన అధికార యంత్రంగం
- క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పర్యటన
సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ కలకలం రేపుతోంది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు డెంగ్యూ బారిన పడి మృతి చెందారు. మరో ఇద్దరికి డెంగ్యూ నిర్థారణ కాగా చికిత్స అందించడంతో కోలుకుంటున్నారు. గ్రామంలో మరో 50 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే చేస్తోంది. కలెక్టర్ హైమవతి, డీఎంహెచ్ వో ధన రాజ్, డీపీవో దేవకి దేవి ఆదివారం తిమ్మాపూర్ ను సందర్శించి డెంగ్యూ మృతుల కుటుంబాలతో మాట్లాడారు.
జ్వరాల బారిన మరో 50 మంది
తిమ్మాపూర్ లో కొనతం మహేశ్ (34) న్యాయని శ్రావణ్ కుమార్ (16) డెంగ్యూతో మృతి చెందారు. మృతులిద్దరూ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ తగ్గక పోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గ్రామంలో జ్వరాల బారినపడిన చాలామంది ఇండ్లలోనే ఉంటూ స్థానికంగా ప్రైవేట్డాక్టర్ల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. మరి కొందరు గజ్వేల్, హైదరాబాద్ కు వెళ్లి కార్పొరేట్ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా వైద్య శాఖ అధికారులు వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
పారిశుధ్య చర్యలు కరువు
తిమ్మాపూర్ లో పారిశుధ్య పనులు సరిగ్గా జరగడంలేదని, చెత్తా చెదారం పేరుకుపోయి దోమల వ్యాప్తితో డెంగ్యూ ప్రబలుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రోడ్డుపై డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్డుపై పారడంతో దోమల వ్యాప్తి చెందుతున్నాయన్నారు. పంచాయతీ అధికారులు వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని ఆరోపిస్తున్నారు. గ్రామంలో జ్వర పీడితులు ఎక్కువగా ఉండడంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సేకరించిన రక్త నమూనాలను సిద్దిపేట టీ హబ్ కు పంపి వెంటనే రిపోర్టులు తెప్పిస్తున్నారు.
లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలి: కలెక్టర్
మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు డెంగ్యూ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గ్రామంలో అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ రమేశ్ క్లినిక్ సీజ్ చేయాలని అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు.
డెంగ్యూ లక్షణాలు ఉండి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎల్లప్పుడూ మానిటరింగ్ చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గ్రామంలో రోడ్ల వెంబడి వర్షపు నీరు నిల్వ ఉండకుండా, డ్రైనేజీలను క్లీన్ చేయాలని జీపీ అధికారులకు చెప్పారు. గ్రామస్తులు ఎలాంటి జ్వర లక్షణాలు ఉన్నా వెంటనే అధికారులకు చెప్పాలని, ఆర్ఎంపీల వద్దకు వెల్లి వైద్యం చేయించుకోవద్దని సూచించారు.