విద్యార్థుల కోసం ఇంటింటికీ తిరిగిన డీఈఓ

విద్యార్థుల కోసం ఇంటింటికీ తిరిగిన డీఈఓ
  • సర్కార్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడం కోసం ఇంటింటికీ తిరుగుతున్న టీచర్లు, హెడ్మాస్టర్లు
  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ‘బడిబాట’

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం టీచర్లు, హెడ్మాస్టర్లు ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించామని.. కార్పొరేట్ కు తీర్చిదిద్దామని చెబుతున్న ప్రభుత్వం.. అధికారులు.. తమ చర్యలకు ఫలితం రావాలంటే విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఒత్తిడి చేస్తున్న ఫలితంగా.. విద్యాశాఖలో మార్పు కనిపిస్తోంది. విద్యార్థుల హాజరును పెంచేందుకు చేపట్టిన బడిబాటలో భాగంగా టీచర్లు, హెడ్మాస్టర్లు, చివరకు అధికారులు కూడా ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ ప్రయత్నాలకు కొన్ని చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచులు తోడు కావడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
విద్యార్థుల కోసం ఇంటింటికీ తిరిగిన డీఈఓ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బడిబాట కార్యక్రమంలో జూలూరుపాడు హైస్కూల్ ను సందర్శించారు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెబితే కుదరదని.. డీఈఓనే స్వయంగా గ్రామంలోని విద్యార్థుల ఇంటింటికీ తిరిగారు. కొందరు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇండ్లకు వెళ్లి స్కూల్ కు వచ్చే వరకు మీ ఇళ్ల దగ్గరే కూర్చుంటానని చెప్పి బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను స్కూల్ కు తీసుకెళ్లారు. జిల్లా స్థాయి అధికారే స్వయంగా గ్రామంలో ఇంటింటికీ తిరగడం సానుకూల స్పందన లభించింది. 


ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నేలపోగు గ్రామంలోకి వచ్చిన ప్రైవేటు స్కూలు బస్సులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన పిల్లలను ప్రైవేట్​ స్కూళ్లకు ఎట్టి పరిస్థితుల్లో పంపించేది లేదని తేల్చి చెప్పారు. నేలపోగుల సర్పంచ్​ దూసరి గణపతి మాట్లాడుతూ గ్రామస్తులందరి అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామస్తుల ప్రోద్భలంతోనే పలు ప్రైవేట్​ స్కూళ్ల బస్సులను అడ్డుకుంటున్నామని చెప్పారు. మన ఊరు.. మన బడి పథకం కింద తమ గ్రామంలోని పాఠశాలలో మౌళిక వసతులన్నీ కల్పిస్తున్నారని.. పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తమ స్కూళ్లలో చేర్పించుకుంటున్నాయని ఆరోపించారు.


లక్ష దాటిన కొత్త అడ్మిషన్లు..
బడి బాట కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం సంతరించుకుంటాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. అమాత్యుల ప్రకటనలు ఆచరణలో పెట్టే విషయంలో అధికారులు, ఉపాధ్యాయుల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు లక్ష దాటడమే దీనికి తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు 1లక్షా 8వేలు దాటాయి. ఈ నెల 3న ప్రారంభమైన బడిబాటలో భాగంగా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 8,719 మంది స్టూడెంట్లు చేరారని విద్యాశాఖ ప్రకటించింది. దీంట్లో ప్రీ ప్రైమరీలో 108మంది చేరగా,  ఒకటో తరగతిలో అంగన్​వాడి కేంద్రాల నుంచి 3,975 మంది, ప్రైవేటు స్కూళ్ల నుంచి 508 , నేరుగా 1,292 మంది పిల్లలు బడుల్లో చేరారు. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు మరో 2,836 మంది విద్యార్థులు చేరారు.