వడ్లను వెదజల్లాలె.. ఎరువులు తగ్గించాలె

వడ్లను వెదజల్లాలె.. ఎరువులు తగ్గించాలె
  • పంట దిగుబడి పెంచుకునేలా నూతన సాగు విధానాలు
  • ఇందుకోసం ప్రతి క్లస్టర్‌లో 400 ఎకరాల కేటాయింపు
  • పంట పద్ధతులపై మార్గదర్శకాలు విడుదల చేసిన వ్యవసాయ శాఖ 

హైదరాబాద్‌, వెలుగు: పంట పొలాలను పరిశోధన కేంద్రాలుగా మార్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. పంట దిగుబడి ఎలా పెంచాలి.. ఎరువులను ఎలా తగ్గించాలి.. పంటను ఏ విధంగా మార్కెటింగ్‌ చేసుకోవాలి.. తదితర వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఏఈవోలకు వ్యవసాయ శాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే వానాకాలం సీజన్‌లో ఏ పంటలు ఎంత సాగు చేయాలో రైతులకు వివరించడంతో పాటు కొత్త సాగు పద్ధతులను అమలు చేసే బాధ్యతలను ఏఈవోలకు, మండల స్థాయిలో ఏవోలకు అప్పగించింది. ఇందులో వెదజల్లే పద్ధతి, ఎరువులకు బదులు పాస్పరస్‌ సాల్వబులైసింగ్‌ బ్యాక్టీరియా(పీఎస్‌బీ)ను వాడే విధానం, మెన్యూర్‌‌ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్లస్టర్ల వారీగా ఈ కొత్త సాగు పద్ధతులను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంతో పాటు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 

ఒక్కో ఏఈవోకు 400 ఎకరాలు..
రాష్ట్రవ్యాప్తంగా 2,601 క్లస్టర్లు ఉండగా, ప్రతి క్లస్టర్‌కు ఒక అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (ఏఈవో) ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏఈవో కనీసం 400 ఎకరాల్లో ఈ కొత్త పద్ధతిని అమలు చేయాలి. క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల వారీగా 135 మంది రైతుల భాగస్వామ్యంతో ప్రయోగాలు చేయనున్నారు. పాస్పరస్‌కు బదులు బాక్టీరియా.. పంట భూముల్లో ఉండే పాస్పరస్‌ మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రైతులు సాధారణంగా డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల రూపంలో పాస్పరస్‌ వినియోగిస్తారు. దీనికి బదులు పీఎస్‌బీనువినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ఫలితంగా డీఏపీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న బాటిల్‌ బయో పీఎస్‌బీని వాడితే రెండున్నర ఎకరాలకి వాడే డీఏపీతో సమానమని చెప్పాలి. 

విడతల వారీగా ఎరువుల వినియోగం..
ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడకుండా, విడతల వారీగా వాడితే మంచిదని రైతులకు అవగాహన కల్పించాలి. నైట్రొజన్‌, యూరియాను విడతల వారీగా వేసుకోవడం వల్ల దిగుబడి ఎలా పెరుగుతుందో చెప్పాలి. దీని వల్ల పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని ఎలా పెంచుకోవాలో వివరించాలి.

వెదజల్లే పద్ధతి.. 
పత్తి, మక్క, జొన్న వంటి పంటలను సాగు చేసినట్లే వరి విత్తనాలను కూడా పొలంలో వెదజల్లే పద్ధతి గురించి రైతులకు వివరించాలి. దీని ద్వారా పది రోజుల ముందే పంట చేతికొస్తుందని చెప్పాలి. దిగుబడి సమయంలో వర్షాలతో పంట నష్టం జరగకుండా కాపాడుకునే వీలుంటుంది. చెరువులు, కాల్వల కింద వరి సాగు చేసే రైతులు వెదజల్లే పద్ధతి అవలంబించడం ద్వారా ఎకరానికి రూ.7 వేల నుంచి రూ.8 వేలు పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుందని వివరించాలి. 

పత్తి, కంది పంటలకు ప్రాధాన్యం..
ఈయేడు నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. దీంతో కోటి ఎకరాల్లో పత్తి, కంది పంటలను ప్రోత్సహించాలని యోచిస్తోంది. వీటిని సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని ఏఈవోలకు వ్యవసాయ శాఖ ఆదేశించింది.

గ్రీన్‌ మెన్యూర్‌ను ప్రోత్సహించడం..
ఈ విధానంలో ముఖ్యంగా సేంద్రియ ఎరువులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసేలా అవగాహన కల్పించాలి. జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర పంటలను సాగు చేసి పూత దశలోనే వాటిని నేలలో కలియదున్ని ఎరువుగా మార్చుకునే విధానం గురించి రైతులకు వివరించాలి. ఫలితంగా భూమిలో నైట్రొజన్‌ పెరిగి నేల స్వభావం, పోషక సామర్థ్యం పెరుగుతుంది. ఇది నేలపై ఒక పొరలాగా ఏర్పడుతుంది. ఎకరం పచ్చిరొట్ట పంటను కలియదున్నడం ద్వారా ఎకరాకు రెండు యూరియా బస్తాలను తగ్గించుకోవచ్చని తెలియజేయాలి.