బదిలీల్లో వింత పోకడ.. స్టూడెంట్లు లేని స్కూళ్లకు టీచర్లు

బదిలీల్లో వింత పోకడ.. స్టూడెంట్లు లేని స్కూళ్లకు టీచర్లు
  • నల్గొండ జిల్లాలోని 55 మూతపడిన స్కూళ్లకు టీచర్ల కేటాయింపు
  • మెదక్​లో 26.. సిరిసిల్లలో 20 పిల్లల్లేని బడులకు టీచర్లు
  • వాటిని తెరిపించడానికేనంటూ అధికారుల వాదన
  • డిప్యూటేషన్ల దందా కోసమేనన్న ఆరోపణలు
  • బదిలీల్లో విద్యాశాఖ వింత పోకడ

నల్గొండ, వెలుగు: జీవో 317 ప్రకారం చేపట్టిన టీచర్ల అలకేషన్​లలో భాగంగా అసలు పిల్లలే లేని స్కూళ్లకు టీచర్లను కేటాయించారు. పిల్లలు లేరని గతంలో మూసేసిన బడులకే ట్రాన్స్​ఫర్​ చేశారు. పిల్లలు ఎక్కువగా ఉండి.. టీచర్లు తక్కువున్న స్కూళ్లను మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలు లేని బడులకు వెళ్లి తామేం చేయాలని టీచర్లు ప్రశ్నిస్తుంటే.. అసలు జీరో ఎన్​రోల్​మెంట్​ స్కూళ్లకు టీచర్లను కేటాయించడం వెనకున్న మతలబేంటన్న చర్చ నడుస్తోంది. డిప్యూటేషన్ల పేరిట లక్షలు దండుకునేందుకే మూతపడిన బడులకు బదిలీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి.. 
నల్గొండ జిల్లాలో పిల్లలు లేని స్కూళ్లు 63 ఉన్నాయి. తాజా బదిలీల్లో వాటిలోని 55 స్కూళ్లకు టీచర్లను కేటాయించారు. నల్గొండ చుట్టు పక్కల ఉన్న స్కూళ్లలోని ఖాళీలను పట్టించుకోకుండా.. జిల్లా కేంద్రం నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని జీరో ఎన్​రోల్​మెంట్​​స్కూళ్లకు ట్రాన్స్​ఫర్​ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, డిండి, నేరేడుగొమ్ము, పీఏపల్లి, తదితర మండలాల్లోని 48 మూతపడిన స్కూళ్లకు ఎక్కువ మందిని కేటాయించారు. ఆ మండలాల్లోనే ఎక్కువ మంది స్టూడెంట్లున్న స్కూళ్లను పట్టించుకోలేదు. సూర్యాపేట జిల్లాలో 17, యాదాద్రి జిల్లాలో 7 జీరో ఎన్​రోల్​మెంట్​ స్కూళ్లకు టీచర్లను అలాట్​ చేశారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పిల్లలు లేని స్కూళ్లు 12 ఉండగా.. వాటన్నింటికీ టీచర్లను కేటాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20,  మెదక్ జిల్లాలో 26 , వరంగల్​ జిల్లాలో 14,  వనపర్తి జిల్లాలో 21 , జగిత్యాల జిల్లాలో పిల్లలు లేని స్కూళ్లకు ఆరుగురుటీచర్లను అలాట్​ చేశారు. కరీంనగర్​ జిల్లాలోనూ 24  జీరో ఎన్​రోల్​మెంట్​ స్కూళ్లకు ఇలాగే టీచర్లను అలాట్​ చేయగా, అక్కడి టీచర్లు ఆందోళన చేశారు. దీంతో వెంటనే సమీప స్కూళ్లకు డిప్యుటేషన్​ ఆర్డర్స్​ ఇచ్చారు. ఇదే జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, కాపులపల్లి, మొల్లపల్లి, నగరం, భోగంపాడు ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్​లేకున్నా ఒక్కో స్కూల్​కు ఇద్దరేసి టీచర్లను అలాట్ చేశారు.
స్కూళ్లను తెరిపించేందుకట..
పిల్లలు లేని స్కూళ్లకు టీచర్లను కేటాయించడం వివాదాస్పదమవుతోంది. ఇదే విషయాన్ని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే.. వాళ్లేమో వింత వాదన వినిపిస్తున్నారు. మూతపడిన స్కూళ్లను తెరిపించేందుకే టీచర్లను కేటాయించామని చెప్తున్నారు. గతంలో పనిచేసిన టీచర్లు, విద్యాశాఖ అధికారులు పిల్లల ఎన్​రోల్​మెంట్​​కోసం చేసిన ప్రయత్నాలు ఫెయిల్​ అయ్యి మూసేసినప్పుడు.. ఇప్పుడు కొత్తగా వెళ్లిన టీచర్లు ఎలా తెరిపిస్తారన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పట్లేదు. పిల్లలు ఎవరూ చేరకుంటే ఏం చేస్తారని అడిగితే.. డిప్యూటేషన్​పై వేరే స్కూళ్లకు పంపుతామని బదులిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో అవసరం లేని స్కూళ్లకు టీచర్లను అలాట్​​చేయడం, ఆ తర్వాత లక్షలకు లక్షలు తీసుకొని మళ్లీ దగ్గరి ఏరియాల్లో డిప్యూటేషన్​పై టీచర్లను పంపడం కొన్ని జిల్లాల్లో కామన్​ అయిందని ఆరోపిస్తున్నారు. కొన్నేండ్లుగా ఈ దందా సాగుతోందంటున్నారు. దీనిపై అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.  
నల్గొండ జిల్లా డిండిలోని  ప్రైమరీ స్కూల్​లో 354 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. గతంలో ఈ స్కూల్​లో 9 శాంక్షన్​ పోస్టులుండేవి. కానీ, ఏడుగురు టీచర్లే పనిచేస్తున్నారు. ఇంగ్లిష్​ మీడియం పెట్టడంతో రెండు..మూడేండ్లలో పెద్దసంఖ్యలో పిల్లలు జాయిన్​ అయ్యారు. ఒకటి నుంచి ఐదో క్లాసు వరకు రెండేసి సెక్షన్లు చేయడంతో టీచర్లు చాలట్లేదు. దీంతో చందాలేసుకొని ఒక విద్యావలంటీర్​ను పెట్టుకున్నారు. తాజాగా జరిగిన ట్రాన్స్​ఫర్లలో ఈ స్కూల్​కు టీచర్లను ఇవ్వకుండా ఇదే మండలంలో మూతపడిన గోనకొల్​ స్కూల్​కు టీచర్​ను కేటాయించారు. ఒక్క డిండి మండలంలోనే మూతపడిన 7 స్కూళ్లకు టీచర్లను ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.