విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువు.. అది దేశాభివృద్ధికీ ప్రమాదం: ప్రధాని మోదీ

విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువు.. అది దేశాభివృద్ధికీ ప్రమాదం: ప్రధాని మోదీ
  • హెచ్​1 బీ వీసా కొత్త రూల్స్​ నేపథ్యంలో వ్యాఖ్యలు

భావ్​నగర్: ఇతర దేశాలపై ఆధారపడటమే మనకు అతిపెద్ద శత్రువని, దాన్ని జయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లయినా ఇంకా పరాయి దేశాల మీద మనం ఆధారపడాల్సి రావడం మంచిది కాదని, దాని నుంచి విముక్తి పొందాలని తాను మొదటి నుంచి చెప్తున్నానని పేర్కొన్నారు. హెచ్​1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ట్రంప్ ​ప్రకటించడం.. ఆ ఎఫెక్ట్​ మన విద్యార్థులు, ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

నేరుగా ఈ అంశంపై ప్రధాని మాట్లాడకపోయినా.. విదేశాలపై ఆధారపడొద్దని అన్నారు. శనివారం గుజరాత్​లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భావ్​నగర్​లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. స్వావలంబన అనేది కేవలం ఆర్థిక పరమైన ఆకాంక్షల చుట్టూ తిరగొద్దని.. అది దేశ గౌరవం, భద్రతకు సంబంధించిందని తెలిపారు. ఇతర దేశాలపై ఆధారపడితే మన ఆర్థిక వ్యవస్థ, దేశాభివృద్ధి దెబ్బతింటుందన్నారు. 140 కోట్ల భారతీయుల భవిష్యత్తును ఇతరుల కోసం ఫణంగా పెట్టబోమని మోదీ పేర్కొన్నారు. 

మన దేశం ‘ఆత్మనిర్భర్​ భారత్​’గా ఎదిగేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లార్జెస్ట్​ ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన దేశం ఇంకా పరాయిదేశాలపైన మనం ఆధారపడాల్సి రావడానికి గత కాంగ్రెస్​ ప్రభుత్వ విధానాలే కారణమని మోదీ దుయ్యబట్టారు.