న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా మకాం వేసిన విదేశీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. వీసా గడువు ముగిసినప్పటికీ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నివాసం ఉంటున్న 130 మంది విదేశీ పౌరులను అధికారులు గుర్తించారు. వారందరిని డిటెన్షన్ సెంటర్‌కు పంపి.. అక్కడి నుంచి తమ స్వదేశాలకు పంపించారు. ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’పేరుతో ఢిల్లీ పోలీసులు నెలరోజులుగా శ్రమించి అక్రమంగా నివసిస్తున్నవారిని గుర్తించారు. డిపోర్ట్ చేసిన వారిలో అత్యధికంగా 87 మంది నైజీరియా పౌరులున్నారు.
వారితో పాటు ఐవరీ కోస్ట్ పౌరులు11, కోస్ట్11, కామెరూన్ 10, ఘనా నుంచి 10 మంది ఉన్నారు. చాలామంది వీసా గడువు ముగిసినా ఓవర్‌స్టే చేస్తూ అద్దె ఇండ్లలో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద 26 కేసులు, ఫారినర్స్ యాక్ట్ కింద 14 కేసులు నమోదు చేశామన్నారు. అలాగే, పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఇండ్లు అద్దెకిచ్చిన 25 మంది ఇంటి యజమానులపై కూడా కేసులు పెట్టామన్నారు.
