సమ్మె ఎఫెక్ట్: డిపోల వారీగా ఆదాయం

సమ్మె ఎఫెక్ట్: డిపోల వారీగా ఆదాయం

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో రెండు రోజులుగా… ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను నడుపుతోంది. ఇందులో కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి. సమ్మె ప్రభావం ఆయా డిపోలపై ప్రభావం చూపింది. వచ్చిన ఆదాయం డీజిల్ ఖర్చులకు కూడా సరిపోలేదంటున్నారు అధికారులు.

* వరంగల్ రీజియన్​లో బతుకమ్మ పండుగ సందర్భంగా రోజూ రూ.2.5 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ శనివారం రూ.10 లక్షలు, ఆదివారం రూ.5 లక్షలే వచ్చింది. అన్ని బస్సుల్లో రూ.10 దాకా అధిక చార్జీలు వసూలుచేశారని ప్రయాణికులు ఆరోపించారు.

* కరీంనగర్ రీజియన్​లో 909 ఆర్టీసీ, అద్దె బస్సులుండగా.. 504 బస్సులను నడిపారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.కోటికి పైగా ఆదాయం వచ్చేది. కానీ శని, ఆదివారాల్లో కలిపి రూ.30 లక్షలు మాత్రమే రావడంతో డీజిల్ చార్జీలు కూడా రాలేదని తెలిసింది. ఆయూబ్, స్వామి, రాజయ్య అనే ఆర్టీసీ డ్రైవర్లు టికెట్ లేకుండా ప్రయాణించడంతో తాత్కాలిక సిబ్బంది గొడవచేశారు. దీంతో పోలీసులు ఆ డ్రైవర్లను అరెస్ట్​ చేశారు.

* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 620 బస్సులుండగా 362 బస్సులను నడిపారు. రూ.9.12 లక్షలు మాత్రమే వచ్చింది.

* ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 7 డిపోల పరిధిలో 750 బస్సులకు గాను 499 బస్సులను నడిపారు. సాధారణ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కోటీ 20 లక్షల ఆదాయం వచ్చేది. శనివారం రూ. 11.95 లక్షలు, ఆదివారం 13 లక్షల ఆదాయం వచ్చింది.

* ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాలో 771 బస్సులకుగాను 296 బస్సులు నడిపారు. సగటున రోజుకు రూ.87 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా, శనివారం 7.78 లక్షలే వచ్చాయి. ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో డిపోల ఎదుట బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.

* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 681 బస్సులుండగా, 350 బస్సులను తిప్పారు. 20 కిలోమీటర్లకు ఆర్టీసీ చార్జీ రూ.13 ఉండగా రూ.30 వసూలు చేశారని ప్రయాణికులు చెప్పారు. తల్లాడ నుంచి ఖమ్మం వరకు రూ.35 టికెట్ ఉండగా రూ.70 వరకు వసూలు చేశారని తెలిపారు. ఇంత చేసినా శని, ఆదివారాల్లో రూ.11 లక్షలు మాత్రమే వచ్చింది. ఖమ్మం రీజియన్​లో సాధారణంగా రోజూ రూ.80లక్షలు వచ్చేది. భద్రాచలం డిపోకు నిత్యం రూ.15 లక్షలు, పండుగ సమయాల్లో రూ.20 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఆదివారం రూ.లక్ష కూడా రాలేదు.

* సిద్దిపేట జిల్లా పరిధిలోని నాలుగు డిపోల్లో రోజుకు రూ.40 లక్షల ఆదాయం వచ్చేది. శనివారం రూ.3 లక్షలే వచ్చింది. సంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.38 లక్షలు వచ్చేది. ఆదివారం రూ.3.5 లక్షలే వచ్చింది.