మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై పీసీసీ చీఫ్ దే తుది నిర్ణయం : డిప్యూటీ సీఎం భట్టి

మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై పీసీసీ చీఫ్ దే తుది నిర్ణయం  :  డిప్యూటీ సీఎం భట్టి
  • ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో కలిసి అభ్యర్థులను ఎంపిక చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి 
  • మంత్రుల భేటీపై కొందరు తప్పుడు రాతలు రాస్తున్నారని ఫైర్ 

మధిర, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్ నిర్ణయం తీసుకుంటారని.. ఆయన నిర్ణయమే ఫైనల్​అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలంతా పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిరలో తన క్యాంపు ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ మెజారిటీ స్థానాలు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీపర్యటనలో ఉండడంతో కొందరు మంత్రులు తనను కలిశారని, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీఎం తనకు చేసిన సూచనలు వారికి వివరించానని అన్నారు. మంత్రులు కూడా వారి సమస్యలు తెలియజేశారని, అవి సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తాము పాలనపరమైన విషయాలమీదే చర్చించామన్నారు.

 ప్రజాభవన్​లో  మంత్రుల భేటీపై కొందరు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారని.. మంత్రులు, డిప్యూటీ సీఎంను కలవకపోతే వార్తలు రాసేవాళ్లతోనో, చూపే వాళ్లతోనో కలుస్తారా? అని ప్రశ్నించారు. కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ ఉమ్మడి కుటుంబమేనని, అందరి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధేనన్నారు. 

తెలంగాణ భవిష్యత్​ కోసం  కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశామన్నారు. ప్యూర్, క్యూర్, రేర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసి గ్లోబల్​ సమ్మిట్​లో విడుదల చేశామని, 2047కల్లా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేస్తామని భట్టి తెలిపారు.