
- యూనిట్లు అమ్మడం, కొనడం చెల్లుబాటు కావు
చింతకాని, వెలుగు: పక్కదారి పట్టిన దళిత బంధు యూనిట్లపై పూర్తి విచారణ జరపాలని, వాటిని రికవరీ చేసి తిరిగి లబ్ధిదారులకే ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తాను సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, మండలంలో మొత్తం 3,462 మందికి దళితబంధు మంజూరయ్యిందని చెప్పారు. వీరందరికీ సంబంధించిన నిధులు కలెక్టర్ ఖాతాలో జమఅయ్యాయని తెలిపారు. మండలంలో 214 మంది దళితబంధు లబ్ధిదారులకు భట్టి సోమవారం చెక్కులు పంపిణీ చేసి, మాట్లాడారు. మండలంలో 1,387 యూనిట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించామన్నారు. కొంతమంది తమకు మంజూరైన యూనిట్లను అమ్ముకున్నారని, మరికొంతమంది యూనిట్లను దారి మళ్లించారని తెలిపారు.
దళిత బంధు యూనిట్లు అమ్మడం, కొనడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. బర్లు, గొర్రెల యూనిట్లను కూడా అమ్ముకున్నారని, వెహికల్స్‌ను కొందరు అమ్మకోగా మరికొందరు లీజ్‌కు ఇచ్చారని, ఫీల్డ్ లెవల్‌లో విచారించి వాటిని రికవరీ చేసి లబ్ధిదారులకే తిరిగి ఇప్పించాలని సూచించారు. యూనిట్లు మంజూరైన వారు వృత్తి, వ్యాపారాలు సమర్థంగా నిర్వహించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని భట్టి సూచించారు.