- 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వండి అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ రామకృష్ణారావుకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. స్టాంప్స్ అండ్రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం పెంపునకు సంబంధించి అధ్యయనం చేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం మంగళవారం సెక్రటేరియెట్‌లో సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగింది. ఇందులో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిళ్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇందుకు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి, ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించాలని సూచించారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో ఆదాయం పెంపునకు సంబంధించి గత సంవత్సరం వేసిన కమిటీ.. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై సమీక్షించారు. రిజిస్ట్రేషన్ల శాఖతో ముడిపడి ఉన్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డు వంటి ఇతర శాఖలను సమన్వయం చేసుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ ట్యాక్స్ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
