విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు : భట్టి

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు : భట్టి
  • మెరుగైన విద్య కోసం ఎంతైనా ఖర్చు చేస్తం: భట్టి
  • విక్టోరియా మెమోరియల్ స్కూల్ ఆధునికీకరణ, ప్రహరీ కోసం రూ.5 కోట్లు మంజూరు
  • వీఎం హోమ్‌లో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు

దిల్​సుఖ్ నగర్, వెలుగు: విద్యా రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తున్నదని, మెరుగైన విద్య కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని భట్టి తెలిపారు. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్  కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్  అనాథాశ్రమంలో విద్యార్థుల సమక్షంలో భట్టి బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యతోనే మానవ వనరులు మెరుగుపడతాయన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న విద్యా రంగానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి కూడా ప్రపంచంతో పోటీపడేలా ఇంటర్నేషనల్  స్టాండర్డ్స్ తో విద్యను అందించేందుకు యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్  నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్ల పెట్టుబడితో ఇంటర్నేషనల్  స్కూల్స్  నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొదటి దశలో రూ.11,600 కోట్లతో 100 పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 

కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్  రెసిడెన్షియల్  స్కూల్  స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్నారు. ఈ మెమోరియల్  చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు రూ5. కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ కో శాఖలోని సీఎస్ఆర్  ఫండ్స్ నుంచి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. వెంటనే ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం విక్టోరియా మెమోరియల్ లో చదువుకుంటున్న అనాథ విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. 

ఈ  కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్  మధుయాష్కీ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్  చైర్మన్  మల్ రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్  ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్  సీనియర్  నేత దేప భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాంధీ భవన్​లో భట్టి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఆదివారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పలువురు  పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వేణుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చల్లా నర్సింహారెడ్డి, ఇతర నేతలు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో భట్టి మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.