ఇవాళ (మార్చి 20) రాష్ట్ర బడ్జెట్.. రూ.3.36 లక్షల కోట్లతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి భారీ పద్దు!

ఇవాళ (మార్చి 20) రాష్ట్ర బడ్జెట్.. రూ.3.36 లక్షల కోట్లతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి భారీ పద్దు!
  • మండలిలో పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు
  • రూ.3.36 లక్షల కోట్లతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి భారీ పద్దు!
  • సొంత రాబడి, భూముల వేలంతో నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంపు అంచనాలు
  • మూలధన పెట్టుబడి కింద భారీగా కేటాయింపులు
  • విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమానికి ప్రాధాన్యం

హైదరాబాద్​, వెలుగు: విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిస్తూ 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​ను సర్కార్​ రెడీ అయింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి(2026–27) ఏకంగా రూ.3.36 లక్షల కోట్ల వరకు బడ్జెట్​ను పెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మార్చితో ముగియనున్న 2025–26 బడ్జెట్​ రూ.3.04 లక్షల కోట్లుగా ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా ఆదాయం ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్లు పెరగడం, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా పక్కాగా చెల్లించి, పెద్ద ఎత్తున నిధులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున  రుణాలను రీస్ట్రక్చర్ చేయడం, రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ మరిన్ని రుణాలను కూడా రీస్ట్రక్చర్​ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా అప్పులు, వడ్డీల భారం తగ్గుతుంది.

ప్రత్యేకంగా అభిజిత్ ముహుర్తం ఎంపిక

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం మధ్యాహ్నం 12  గంటలకు అభిజిత్ ముహుర్త సమయంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు బట్​ను సమర్పించనున్నారు. ఈ మేరకు బడ్జెట్​కు గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అసెంబ్లీ లాబీల్లోని కమిటీ హాల్​లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్​కు ఆమోదం తెలుపనున్నది.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆశించిన మేర ఆదాయాన్ని సాధించింది. పన్నుల రాబడిలో సవరించిన అంచనాల ప్రకారం దాదాపు 92 శాతం మేర రానున్నట్లు తెలుస్తున్నది. పన్నుల రూపేణా రూ.1.75 లక్షల కోట్లు అంచనాలు వేయగా వాటికి దగ్గరగా రీచ్ అవుతున్నది. జీఎస్టీ స్లాబులు మారినప్పటికీ ఆదాయానికి పెద్దగా గండిపడలేదు. దీంతో ఈసారి పన్ను ఆదాయాన్ని రూ.1.90 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం

విద్య, వైద్యంతో పాటు వ్యవసాయం, సంక్షేమ పథకాలకు బడ్జెట్​లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదే సమయంలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరుగనున్నది. వ్యవసాయంలో రైతు భరోసా, రైతుబీమా, మెకనైజేషన్​కు ఆ తర్వాత ఎడ్యుకేషన్​కు కూడా మంచి కేటాయింపులు ఉంటాయని తెలుస్తున్నది.

పాలమూరు ప్రాజెక్టు పూర్తికి, తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మణానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయించనున్నది. మూసీ రివర్​ఫ్రంట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీకి కూడా బడ్జెట్​లో నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. జీఎస్డీపీలో 3 శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి.