ఇండియా కూటమి రాగానే రైతులకు రుణమాఫీ.. భట్టి విక్రమార్క

ఇండియా కూటమి రాగానే రైతులకు రుణమాఫీ.. భట్టి విక్రమార్క
  • ప్రధాని స్థాయిని మోదీ దిగజార్చారు
  • అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తాం
  • పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం స్పీచ్   

హైదరాబాద్, వెలుగు :  కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్మీలో రిక్రూట్మెంట్ల కోసం తెచ్చిన అగ్నివీర్ స్కీంను రద్దు చేస్తామన్నారు. భారత సైనికులను కార్మికులుగా మార్చి రెండు రకాల అమరవీరులను ప్రధాని నరేంద్రమోదీ సృష్టించారని ఆయన ఫైర్ అయ్యారు.

అమరవీరుల హోదా, పెన్షన్ తో పాటు అన్ని సౌకర్యాలు పొందే వారు ఒకరైతే, పేద కుటుంబాల యువతకు మాత్రం ఇలాంటి గౌరవాలు, సౌకర్యాలు లేకుండా వివాదాస్పద పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అగ్నివీర్ పథకం సైన్యం ఆలోచన కాదని ఇది మోదీ కుట్రపూరిత పథకమన్నారు. సోమవారం పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని కోటక్ పురలో భట్టి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.

ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. రుణమాఫీ అవసరమైన ప్రతిసారీ ఆ కమిటీ సిఫారసులు చేస్తుందని, తాము అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బిలియనీర్ లు అయిన అదానీ, అంబానీ నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎయిర్ పోర్టులను, రైల్వే స్టేషన్లను అదానీ గ్రూపులకు కట్టబెట్టిన మోదీ తన పరువు పోగొట్టుకోవడమే కాకుండా ఈ దేశం పరువు కూడా తీశారన్నారు.  

దేశ ప్రజలు మార్పు తెస్తున్నారు..  

దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి పరిస్థితులకు త్వరలోనే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని భట్టి హెచ్చరించారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువతకు తీరని నష్టం జరుగుతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నారని అన్నారు.

దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి వస్తున్న ఆదరణ చూసి మోదీ తీవ్ర ఆందోళన చెందుతున్నారని, అందుకే ప్రతిపక్షాలపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవాల్సిన ప్రధాని మోదీ.. మతం, మంగళసూత్రం, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.

ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గిస్తున్నారని విమర్శించారు. ‘‘మనం పాకిస్తాన్ తో పోరాడి బంగ్లాదేశ్ కు స్వతంత్రం తెచ్చిపెట్టాం. కానీ చైనా మన భూమిని ఆక్రమించి ఇండ్లు, రోడ్లు నిర్మిస్తున్నా  ప్రధాని మోదీ మాత్రం మౌనంగా ఉండడం దేనికి సంకేతం?” అని ఆయన ప్రశ్నించారు.