కేసీఆర్​.. అబద్ధాలు బంజేయ్

కేసీఆర్​.. అబద్ధాలు బంజేయ్
  • రాష్ట్రాన్ని నిండా ముంచిందే నువ్వు.. నీ పాలన పాపాలే రైతులకు శాపాలైనయ్​
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​బాబు ఫైర్​
  • రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నడు:  భట్టి విక్రమార్క
  • గత బీఆర్​ఎస్​ పాలన, 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్
  • ఇరిగేషన్, పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిండు: ఉత్తమ్​
  • కృష్ణా నీళ్లను ఏపీ దోచుకపోతుంటే నోరెందుకు మెదపలేదని నిలదీత
  • ఫోన్​ ట్యాపింగ్​లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక
  • ఎన్నికల కోసం కేసీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నడు :  శ్రీధర్​బాబు

న్యూఢిల్లీ/హైదరాబాద్/పెద్దపల్లి, వెలుగు : పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని నిండా ముంచి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేసీఆర్​పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, శ్రీధర్​బాబు మండిపడ్డారు. కేసీఆర్​ చేసిన తప్పులే ఇప్పుడు రైతుల కష్టాలకు కారణమని అన్నారు. అధికారం పోయిందని, ఇక బీఆర్​ఎస్​ అడ్రస్​ కూడా ఉండదన్న ఫ్రస్టేషన్​లో ఇష్టమున్నట్లు ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు.

రైతులకు పరామర్శ పేరిట కేసీఆర్​ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. పవర్​లో ఉన్నప్పుడు రైతుల దిక్కు చూడని ఆయన ఇప్పుడు లోక్​సభ ఎన్నికల కోసం కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ‘‘ఓ వైపు కూతురు కవిత జైల్లో ఉంది. ఇంకో వైపు కాళేశ్వరం స్కామ్​, పశువుల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వరుస స్కామ్​లు కేసీఆర్ ను వెంటాడుతున్నయ్​. రానున్న రోజుల్లో ఇంకా ఏమైతదోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నది” అని అన్నారు.

సోమవారం మంత్రులు వేర్వేరుచోట్ల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ తీరును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇరిగేషన్​, పవర్​ సెక్టార్లను సర్వనాశనం చేసిందే కేసీఆర్​ అని, కృష్ణా నీళ్లను ఏపీ దోచుకపోతుంటే నోరు మెదపలేదని అన్నారు. పదేండ్లు అబద్ధాలతోనే పాలన సాగించారని, ఇప్పుడు అదే పద్ధతిలో ఉంటామంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. అబద్ధాలు, డ్రామాలు బంజేయాలని అన్నారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని మంత్రులు ప్రకటించారు.