అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం :  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు: అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని  సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సుడిగాలిలా డిప్యూటీ సీఎం పర్యటించారు. అందులో భాగంగా మధిర మండలం ఆత్కూరులోని అగ్నిప్రమాదానికి గురైన సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని పరిశీలించారు.  

అనంతరం బాధితులతో  మాట్లాడారు.    రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం బీమా ద్వారా అందించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం  మధిర మండలం సిరిపురంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, ఐటీఐ భవనాలను  పరిశీలించారు.  

నిర్ణీత సమయంలోగా భవన నిర్మాణాలన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.  బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటుగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు,  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.