ప్రజావాణిలో ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించండి: భట్టి విక్రమార్క

ప్రజావాణిలో ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించండి: భట్టి విక్రమార్క
  •     ఇకపై మూడు నెలలకోసారి రివ్యూ: డిప్యూటీ సీఎం భట్టి  
  •     త్వరలోనే రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు  
  •     ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు : ప్రజావాణి ద్వారా అందుతున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే సూచించాలని కోరారు. ఇక నుంచి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిపై ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేపడతామని తెలిపారు. ఆదివారం సెక్రటేరియెట్ లో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ తో కలిసి భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి అందుతున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరు, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులెన్ని?, శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులెన్ని? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తాము ఇచ్చిన అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉందా? అని అధికారులను ప్రశ్నించారు. అయితే ప్రస్తుతానికి అలాంటి వ్యవస్థ అందుబాటులో లేదని దివ్య దేవరాజన్ తెలిపారు. అప్లికేషన్ అందిన తర్వాత, సమస్య పరిష్కారమైన తర్వాత ఎస్సెమ్మెస్ లు పంపిస్తున్నామని చెప్పారు.  

ఆ దరఖాస్తులే ఎక్కువ.. 

కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులే పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టికి దివ్య దేవరాజన్ వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే నిర్ణయం తీసుకుని కొత్త కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతున్నదని చెప్పారు. కొత్త పెన్షన్లను సైతం త్వరలోనే మంజూరు చేస్తామని వెల్లడించారు. ‘‘మహిళలకు ఉచితంగా కుట్టు మిషిన్లు ఇస్తే ప్రయోజనం లేదు. వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ డెస్క్ లను బలోపేతం చేస్తే సీఎంఆర్ఎఫ్ ఫిర్యాదులు తగ్గిపోతాయి” అని అన్నారు. జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులు తీసుకునే మండల స్థాయి సిబ్బందికి శిక్షణనిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రజావాణి విభాగంలో పని చేసేందుకు పూర్తిస్థాయి సిబ్బంది కేటాయింపుపై తగిన చర్యలు తీసుకుంటామని భట్టి చెప్పారు. 

కోచింగ్ సెంటర్లు నిర్మించండి

భూములు అందుబాటులో ఉన్న 20 ప్రాంతాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు ప్రారంభించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. ఆదివారం సెక్రటేరియెట్ లో విద్యాశాఖ, ఆర్అండ్ బీ, ఫ్రీ కాస్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల డిజైన్, వ్యయం తదితర అంశాలపై చర్చించారు. మొదటి దశలో ప్రారంభించనున్న 20 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి కావాలని అధికారులను భట్టి ఆదేశించారు. ఇకపై వారానికోసారి రివ్యూ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 37 ప్రాంతాల్లో 49 పాఠశాలల నిర్మాణానికి సంబంధించి స్థలాల వివరాలు వచ్చాయని డిప్యూటీ సీఎంకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం వివరించారు. అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్స్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన ప్రారంభించాలని భట్టి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా పాలిటెక్నిక్ కళాశాలలో సెంటర్లను నిర్మించాలని సూచించారు.