హైదరాబాద్, వెలుగు :అదనపు ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని వివిధ శాఖల అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరులు, హౌజింగ్ కార్పొరేషన్, హౌజింగ్ బోర్డ్, హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ శాఖల్లోని ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు వనరుల సమీకరణపై రివ్యూ చేశారు.
ఆయా శాఖల వారీగా ప్రభుత్వానికి రావలసిన పెండింగ్ బకాయిలపై చర్చించారు. పరిశ్రమలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ శాఖల పరిధిలో జరిగిన భూ అమ్మకాలు, తద్వారా సమకూరిన ఆదాయం, ఇంకా రావలసిన బకాయిలు, వాటి వసూళ్లకు అవసరమైన కార్యాచరణ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు సమకూర్చుకునేందుకు కార్యాచరణ రూపొందించుకొని నిధులను రాబట్టాలని అధికారులకు సూచించారు.
రావాల్సిన ప్రతి పైసాను సమీకరించే బాధ్యత ఆయా శాఖల అధికారులే తీసుకోవాలని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కులను వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూప్రాన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రభుత్వం 325 ఎకరాలు కేటాయించగా ఇప్పటివరకు 139 ఎకరాలు అప్పగించారని..ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న జాయింట్ వెంచర్స్ నుంచి ప్రభుత్వానికి రావలసిన ఆదాయ వనరుల గురించి ఆరా తీశారు. దానికి సంబంధించి సమగ్ర నివేదికను అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
బకాయిలు రాబట్టేందుకు ప్రణాళికలు
హౌజింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన 12 జాయింట్ వెంచర్స్ ప్రాజెక్టులో ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వానికి 955 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా రూ.430 కోట్లు వచ్చాయని తెలిపారు. మిగతా రూ.525 కోట్ల బకాయిలు రాబట్టేందుకు రూపొందించుకున్న ప్లాన్ ను హౌజింగ్ బోర్డ్ అధికారులు మంత్రికి వివరించారు. రాయల్టీ ద్వారా రావలసిన ఆదాయంలో ఉన్న పెండింగ్ గురించి మైనింగ్ అధికారులను అడిగి బట్టి విక్రమార్క తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకోవడానికి ఇతర అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు.
