
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆషాడమాస బోనాల పండుగ పురస్కరించుకుని ఆదివారం (జూలై 20) హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి లాల్ దర్వాజా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం లాల్ దర్వాజ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. గోల్కొండలో మొదలైన ఆషాడ బోనాలు బల్కంపేట, సికింద్రాబాద్, లాల్ దర్వాజలో విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
అమ్మవారికి బోనం సమర్పించేందుకు లక్షలాదిగా వస్తోన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మంత్రి పొన్నంతో కలిసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. 1290 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. నగరంలో బోనాల ఉత్సవాలకు 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పారు.