పోలవరం, బనకచర్ల పాపం ఎవరిది?.. బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, టీడీపీ కుట్ర ఫలితమే ఏపీ ప్రాజెక్టులు: డిప్యూటీ సీఎం భట్టి

పోలవరం, బనకచర్ల పాపం ఎవరిది?.. బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, టీడీపీ కుట్ర ఫలితమే ఏపీ ప్రాజెక్టులు: డిప్యూటీ సీఎం భట్టి
  •     బనకచర్లపై బీఆర్‌‌ఎస్‌‌ నేతలుపదేండ్లు ఎందుకు మాట్లాడలే?
  •     మంత్రి జూపల్లితో కలిసికొల్లాపూర్‌‌లో పర్యటన

కొల్లాపూర్‌‌, వెలుగు: పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల పాపం ఎవరిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పదేండ్లు ఏపీకి తాకట్టుపెట్టిన వారే ఇప్పుడు సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం బనకచర్ల కడుతుంటే కేసీఆర్ ​ప్రభుత్వం పదేండ్లు ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. పోలవరం, బనకచర్ల నిర్మాణాల వెనక ఎవరున్నారో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. సాగునీటి వాటాలో తెలంగాణ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలతో  పాటు తెలంగాణలోని బీఆర్​ఎస్​నేతల కుట్రల ఫలితమే ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులని ఆయన మండిపడ్డారు. శనివారం నాగర్​ కర్నూల్​జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం పర్యటించారు. పలు సబ్​స్టేషన్ల నిర్మాణాలకు భూమి భూమిపూజ చేసి.. రైతులకు ట్రాన్స్​ఫార్మర్లు, మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కొత్త రేషన్​ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఒక్క ఆర్డినెన్స్​తో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టినప్పుడే బీజేపీ నిజస్వరూపం బయటపడిందన్నారు.

వాటిని తిరిగి తెలంగాణలో కలుపుకునేందుకు న్యాయపరంగా పోరాడుతామని తెలిపారు. కృష్ణానదికి ఎగువ ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండటం వల్ల దిగువన ఉన్న ఏపీ.. కృష్ణా జలాలను అక్రమంగా మళ్లిస్తోందని ఆరోపించారు. పదేండ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్​ఎస్​ కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్​ సీఎంగా ఉన్న కాలంలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే ఈ రోజు ఏపీ బనకచర్ల పేరుతో నాటకాలు ఆడేది కాదన్నారు.

ఏపీ చర్యలతో త్వరలో శ్రీశైలం ఖాళీ: మంత్రి జూపల్లి 

 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌‌ర్ విస్తరించుకోని ఏపీ చేస్దున్న జల దోపిడీతో శ్రీశైలం రిజ‌‌ర్వాయ‌‌ర్ రెండు మూడు నెలల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు.  దీన్ని అడ్డుకునేందుకు వెల్టూరు-, చిన్నమరూర్ మ‌‌ధ్య కృష్ట్రాన‌‌దిపై డ్యాం నిర్మించాలని..  జూపల్లి కోరారు. సభలో ఎంపీ మల్లు రవి,  ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేశ్‌‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.