- వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
- బెంగళూరులో కర్నాటక ఇంధన మంత్రితో భేటీ
- బొగ్గు మైనింగ్‌లో కలిసి నడుద్దామని పిలుపు
హైదరాబాద్, వెలుగు: కర్నాటక రాష్ట్రానికి సింగరేణి బొగ్గు అందించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బొగ్గు మైనింగ్‌లో కలిసి నడుద్దామని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. గురువారం కర్నాటక రాజధాని బెంగళూరులో ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్‌తో భట్టి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, బొగ్గు సరఫరా, కొనుగోళ్లు, చెల్లింపులు, సాంకేతికత మార్పిడిపై చర్చించారు. కర్నాటక థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు సరఫరా చేయాలని కర్నాటక మంత్రి జార్జ్ కోరారు.
దీంతో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఏటా 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని భట్టి సింగరేణి అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా తగినంత బొగ్గు అందించేందుకు సింగరేణి, కర్నాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) కలిసి జాయింట్ వెంచర్‌గా పనిచేయాలని భట్టి ప్రతిపాదించారు. కర్నాటక జెన్‌కో చత్తీస్‌గఢ్, ఒడిశాలో చేపట్టిన క్యాప్టివ్ కోల్ బ్లాకుల్లో సింగరేణి అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బొగ్గు మైనింగ్‌లో సింగరేణికి దాదాపు 137 ఏండ్ల అనుభవం ఉందని తెలిపారు. అదే విధంగా విద్యుత్ రంగంలో కర్నాటకకు ఉన్న అనుభవాన్ని సింగరేణి భవిష్యత్ పవర్ ప్లాంట్ల నిర్వహణలో ఉపయోగించుకోవచ్చన్నారు. ఇరు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడే అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించగా, జార్జ్ సానుకూలంగా స్పందించారు.
బొగ్గు సరఫరా పెంచాలి
కర్నాటకలో పారిశ్రామిక ప్రగతితో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నందున థర్మల్ పవర్ ప్రాజెక్టులకు తెలంగాణ నుంచి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని మంత్రి జార్జ్ కోరారు. ప్రస్తుతం సింగరేణి ఏటా 10.54 మిలియన్ టన్నుల బొగ్గును కర్నాటకకు సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఎర్రమారస్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు 5.24 మిలియన్ టన్నులు, రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్‌కు 3.01 మిలియన్ టన్నులు, బళ్లారి యూనిట్- 2.29 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రోజుకు కనీసం నాలుగు గూడ్స్ రైళ్ల (రేకుల) ద్వారా బొగ్గు సరఫరా జరుగుతున్నదని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను మరింత పెంచాలని కోరారు. సమావేశంలో కర్నాటక అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి, కేపీసీఎల్ ఎండీ రాజేంద్ర చోళన్, కేపీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ నాగరాజు, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న, జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేవదుర్గ బంగారు గనిని పరిశీలించిన భట్టి
కర్నాటకలో సింగరేణి సంస్థ దక్కించుకున్న దేవదుర్గ బంగారు గని ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలుకా లింగదహళ్లికి చేరుకున్న భట్టికి కలెక్టర్‌తోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరమానంద శివాలయంలో భట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింగరేణి ఆఫీసర్లతో కలిసి బంగారం, రాగి ఖనిజ బ్లాకులను పరిశీలించారు. అక్కడ సింగరేణి అధికారులు సేకరించిన వివిధ ఖనిజ నమూనాల ఎగ్జిబిషన్ ను భట్టి సందర్శించారు.
